రూల్‌కర్వ్స్‌ రూపకల్పనలో సీడబ్ల్యూసీ ఆదేశాలు పాటించాలి

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల రూల్‌కర్వ్స్‌ ముసాయిదా రూపకల్పనకు గతంలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఇచ్చిన మార్గదర్శకాలు(క్లియరెన్స్‌), పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణాబోర్డును తెలంగాణ కోరింది.

Published : 03 Jul 2022 05:26 IST

కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ
శ్రీశైలం నుంచి సాగునీటి మళ్లింపునకు కనీస మట్టం 854 అడుగులని ఉద్ఘాటన

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల రూల్‌కర్వ్స్‌ ముసాయిదా రూపకల్పనకు గతంలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఇచ్చిన మార్గదర్శకాలు(క్లియరెన్స్‌), పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణాబోర్డును తెలంగాణ కోరింది. రూల్‌కర్వ్స్‌పై ముసాయిదా రూపకల్పనకు జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్‌ఎంసీ) కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, సీడబ్ల్యూసీ/టీఏసీ మార్గదర్శకాలను అనుసరించాలంటూ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ శనివారం బోర్డుకు లేఖ రాశారు. లేఖతోపాటు చెన్నైకు తాగునీటి విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని, ఇతర ఆధారాలను జతచేస్తున్నట్లు తెలిపారు. ‘శ్రీశైలం జలాశయం నుంచి నీటిని మళ్లించే కనీస మట్టం స్థాయి(ఎండీడీఎల్‌) 854 అడుగులని గతంలోనే నిర్దేశించారు. కృష్ణానదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 (కేడబ్ల్యూడీటీ) శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు నీటి మళ్లింపునకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. అయినా చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీల వరకు తరలించేందుకు 1977లో అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. జులై, అక్టోబరు మధ్య 1500 క్యూసెక్కుల చొప్పున తరలించాలని, మార్గమధ్యలో సాగునీటికి ఆ జలాలను వినియోగించొద్దని ఒప్పందంలో ఉంది. కానీ, ఏపీ రాష్ట్రం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 14 తూములతో నిర్మించింది. ఒక్కో తూము నుంచి 11,150 క్యూసెక్కులు వెళ్లేలా ఒప్పందానికి భిన్నంగా దాని నిర్మాణం చేసింది. అనంతరం శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా మార్చింది. జలాశయం నుంచి నీటిని మళ్లించేందుకు నిర్మించిన కండక్టర్‌ సిస్టం 1977 ఒప్పందంలోని క్లాజ్‌-5 ప్రకారం ఉండాలి. కండక్టర్‌ సిస్టంను హెడ్‌రెగ్యులేటర్‌, ఎస్‌ఆర్‌ఎంసీ-బనకచర్ల రెగ్యులేటర్‌గా పేరు మార్చారు. సీడబ్ల్యూసీ మంజూరు చేసిన ఎండీడీఎల్‌, పోతిరెడ్డిపాడు దిగువన కాల్వ సెక్షన్‌లకు సంబంధించిన అనుమతులు, ఉత్తర ప్రత్యుత్తరాలను సమగ్రంగా పరిశీలించకపోతే శ్రీశైలం రూల్‌కర్వ్స్‌ రూపకల్పన ప్రభావవంతంగా ఉండదు. ప్రాథమిక వివరాలు, ఒప్పంద ఉల్లంఘనలు, అక్రమంగా ఏర్పాటు చేసుకున్న సిస్టం తదితర వివరాలను రూల్‌కర్వ్స్‌ ముసాయిదా రూపకల్పనలో వీలైనంత త్వరగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని లేఖలో ఈఎన్‌సీ కోరారు. .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని