‘వర్సిటీలో వసూల్‌ రాజా’పై నివేదిక ఇవ్వండి

‘వర్సిటీలో వసూల్‌ రాజా’ శీర్షికన శనివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న.....

Updated : 03 Jul 2022 07:16 IST

అధికారులకు మంత్రి సబిత ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘వర్సిటీలో వసూల్‌ రాజా’ శీర్షికన శనివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై వాస్తవాలను తెలుసుకొని నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రిని, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ను ఆదేశించినట్లు తెలిసింది. వర్సిటీ వసూళ్లపై గతంలోనే పలు ఆరోపణలు రాగా.. ఆ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల నుంచి తనిఖీల పేరిట వసూళ్ల పర్వంపై కథనం ప్రచురితం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. నవీన్‌ మిత్తల్‌, ఆచార్య లింబాద్రితో మంత్రి సబిత మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రితో చర్చించారు. ఆ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రైవేట్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియపై సీఎస్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా ‘వసూల్‌ రాజా’ అవినీతిపై అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అవసరమైతే ఓ కమిటీని నియమించి లోతుగా విచారణ జరిపించి, నివేదిక తెప్పించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏదో ఒక చర్య తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని