ప్రధానికి ఘనస్వాగతం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బేగంపేట విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు మోదీ బేగంపేట చేరుకున్నారు.

Published : 03 Jul 2022 05:26 IST

హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి
మూడోసారీ కేసీఆర్‌ దూరం

ఈనాడు, హైదరాబాద్‌; బేగంపేట, న్యూస్‌టుడే : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బేగంపేట విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు మోదీ బేగంపేట చేరుకున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని స్వాగత కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంలో సీఎం  దూరంగా ఉండటం ఆరు నెలల్లో ఇది మూడోసారి. మోదీకి స్వాగతం పలికిన వారిలో భాజపా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు ఉన్నారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి వెళ్లారు. ఈ సందర్భంగా భాజపా మహంకాళి-సికింద్రాబాద్‌ అధ్యక్షులు బూర్గుల శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పార్టీ జెండాలను ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. డప్పుల మోతలు, జానపద కళాబృందాలతో విమానాశ్రయ ప్రాంగణంలో సందడి నెలకొంది. మోదీ రాకకు ముందుగానే ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు వేర్వేరుగా ప్రత్యేక విమానాల్లో బేగంపేట చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లలో హెచ్‌ఐసీసీకి వెళ్లారు.

ప్రధాని రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది.  షెడ్యూలు ప్రకారమే మోదీ హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి వెళ్లారు.


డైనమిక్‌ నగరానికి చేరుకున్నా

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగమయ్యేందుకు డైనమిక్‌ నగరమైన  హైదరాబాద్‌కు ఇప్పుడే చేరుకున్నా. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించి, పార్టీని మరింత బలోపేతం చేస్తాం’’

- ప్రధాని మోదీ ట్వీట్‌ (తెలుగు, ఆంగ్ల భాషల్లో)


ప్రధానికి ధన్యవాదాలు

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ను  డైనమిక్‌సిటీ అని పేర్కొన్నందుకు ధన్యవాదాలు. దీనికి తగినట్లుగానే హైదరాబాద్‌, తెలంగాణ అభివృద్ధికి తగినన్ని నిధులు ఇవ్వాలని కోరుతున్నాం.

- ట్విటర్‌లో రాష్ట్ర మంత్రి తలసాని


ఆర్భాటం లేకుండా శంషాబాద్‌కు అమిత్‌షా

శంషాబాద్‌, న్యూస్‌టుడే : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ద్వారం నుంచి బయటకు వచ్చారు. ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా ఇదే ద్వారం నుంచి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు