జ్యుడిషియల్‌ సభ్యుడి నియామకం రద్దు

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సభ్యుడి(జ్యుడిషియల్‌)గా కొల్లా రంగారావు నియామకాన్ని రద్దుచేస్తూ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Published : 03 Jul 2022 06:19 IST

నిఘా నివేదిక నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సభ్యుడి(జ్యుడిషియల్‌)గా కొల్లా రంగారావు నియామకాన్ని రద్దుచేస్తూ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఫిబ్రవరిలో కమిషన్‌కు ఇద్దరు సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారి పూర్వాపరాల(యాంటిసిడెంట్స్‌)పై ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా కొల్లా రంగారావు నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 12వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా వికారాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న రంగారావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ బార్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంగా 2018లో హైకోర్టు ఆయనను సస్పెండ్‌ చేసింది. అనంతరం నిర్వహించిన విచారణలో ఆయా ఆరోపణలు వాస్తవాలని నిర్ధారణ కావటంతో 2019లో ఆయనచే అత్యవసర పదవీ విరమణ చేయించింది. ఈ మేరకు నిఘా విభాగం ఇచ్చిన నివేదికను అనుసరించి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సభ్యుడి పోస్టుకు రంగారావు అనర్హుడంటూ పౌరసరఫరాల శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిబంధనలకు నీళ్లు..!: జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుల నియామకాల్లో అధికారులు నిబంధనలు పాటించటం లేదన్న విమర్శలు రేగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కమిషన్‌ అధ్యక్షులను నియమిస్తూ గత నెలలో ఉత్తర్వులు జారీచేయటం చర్చనీయాంశమైంది. 1986 నాటి చట్టం ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు ఫిర్యాదుల్లో పలువురు పేర్కొన్నారు. 2020లో కేంద్రం ఆ చట్టంలో మార్పులు చేసినా.. పాత చట్టం ప్రకారం నియామకాలు జరిపారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని