Hyderabad News: తెలంగాణ వంటలు రుచి చూపిస్తాం: హైటెక్స్‌కు యాదమ్మ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి హాజరైన ముఖ్య నాయకులకు తెలంగాణ సంప్రదాయ వంటలను రుచి చూపిస్తామని గూళ్ల యాదమ్మ చెప్పారు.

Updated : 03 Jul 2022 09:27 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి హాజరైన ముఖ్య నాయకులకు తెలంగాణ సంప్రదాయ వంటలను రుచి చూపిస్తామని గూళ్ల యాదమ్మ చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఇలా సమావేశాలకు హాజరైన అందరికీ రుచికరమైన వంటలు వండడానికి సిద్ధమయ్యామని అన్నారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన యాదమ్మ బృందం భాజపా కార్యవర్గ సమావేశాలకు వేదికైన హైటెక్స్‌కు శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా యాదమ్మను ‘ఈనాడు’ పలకరించింది. ఆమె మాట్లాడుతూ గంగవాయిలి కూర, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, ముద్దపప్పు, పప్పుచారు, పచ్చిపులుసు ఇలా మొత్తం 25 రకాల వంటలను దేశ ప్రధానికి రుచి చూపించబోతున్నానని అన్నారు.

ఎక్కడ బహిరంగ సభలు జరిగినా.. పెద్ద వేడుకలైనా.. వారికి వండిపెట్టానని.., ఇలా తన వంటలు రుచి చూసిన అనేకమంది నేతలు ఈ అవకాశం కల్పించారన్నారు. ఎంపీ బండి సంజయ్‌ ఎన్నోసార్లు మెచ్చుకున్నారని చెప్పారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు వంట తనదేనని, మంత్రి గంగుల కమలాకర్‌, వివిధ పార్టీల నాయకుల సమావేశాలకే కాదు ఆలయాల్లో ఉత్సవాలకు వంటలు చేసే భాగ్యం తనకు దక్కిందని యాదమ్మ తెలిపారు. ప్రధానమంత్రి సారు కూడా తెలంగాణ రుచులను చూడాలనుకుంటున్నారు.. వండిపెట్టాలని సంజయ్‌ అడగడంతో తాము ఇక్కడికి వచ్చామని యాదమ్మ మురిసిపోయారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని