TRS: మళ్లీ మొండిచెయ్యే!

జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట భాజపా హడావిడి చేసి... చివరికి తుస్సుమనిపించిందని రాష్ట్ర మంత్రులు విమర్శించారు. సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌ వేదికగా దేశానికి.. తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానం ఏదైనా ప్రకటిస్తారని ఆశిస్తే కల్లబొల్లి

Updated : 04 Jul 2022 10:12 IST

ప్రధాని మోదీవి ఈసారీ కల్లబొల్లి మాటలే..

కేసీఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేదు

జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఒరిగిందేమిటి?

భాజపాపై రాష్ట్ర మంత్రుల ధ్వజం

ఈనాడు - హైదరాబాద్‌

జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట భాజపా హడావిడి చేసి... చివరికి తుస్సుమనిపించిందని రాష్ట్ర మంత్రులు విమర్శించారు. సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌ వేదికగా దేశానికి.. తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానం ఏదైనా ప్రకటిస్తారని ఆశిస్తే కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు(అబద్ధాలు) తప్ప ఏమీ లేదని తేల్చేశారని, సీఎం కేసీఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీతనమే లేదని నిరూపించారని ఎద్దేవా చేశారు. ఆదివారం భాజపా సభ అనంతరం మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, ఇంకా పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వినోద్‌లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.

మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ‘‘తెలంగాణకు మోదీ మళ్లీ మొండిచెయ్యే చూపారు. గుజరాత్‌, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాల మాదిరే ఇక్కడ ఏదైనా ఇస్తారనుకుంటే ప్రజలకు పనికివచ్చే ప్రకటన ఒక్కటీ చేయలేదు. రాష్ట్రం నుంచి రూ.లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామన్నారు. మరి గడిచిన నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడంలేదు. సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) తీసుకునేందుకు నిరాకరిస్తోంది. దీని విలువ రూ.22 వేల కోట్లు ఉంటుంది. రైతుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ తీసుకుంటామని సభావేదిక నుంచి ప్రకటిస్తారని ఆశించినా ఆ ఊసే లేదు. మహిళల గురించి గొప్పలు చెబుతున్న మోదీ.. పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎనిమిదేళ్లయినా ఎందుకు ఆమోదించలేదో చెబితే బాగుండేది. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని ఈ సభలో చెప్పారు. మా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపినా.. ఇప్పటివరకూ కేంద్రం ఆమోదించలేదు. మా గిరిజన విశ్వవిద్యాలయం ఊసే లేదు. సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయ పండగ హోదా ఇవ్వలేదు. తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడంలేదా?’’ అని హరీశ్‌ ప్రశ్నించారు.

మోసపు మాటలు నమ్మరు: ప్రశాంత్‌రెడ్డి

‘‘హైదరాబాద్‌లో మోదీ చెప్పిన మోసపు మాటలను ప్రజలు నమ్మరు. కేసీఆర్‌ అంటే మోదీకి ఎంత భయమో రుజువైంది. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన మోదీ, అమిత్‌షా రాష్ట్రానికి శత్రువులే. వారు రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. మాగడ్డ మీదకు వచ్చి అరిచి గీ పెట్టినంత మాత్రాన ఇక్కడి ప్రజలు మీ మాటలు నమ్మరు. యువ నాయకుడు కేటీఆర్‌ కృషితో దేశంలో అగ్రగామిగా రాష్ట్రం పురోగమిస్తుంటే దాని జీర్ణించుకోలేకపోతున్నారు.’’ అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

కేంద్రం చేసిందేమీ లేదు: జగదీశ్‌రెడ్డి

‘‘తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధి అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది. కేంద్రం నుంచి పైసా సాయం లేదు. సీఎం కేసీఆర్‌ దార్శనికత, హైదరాబాద్‌ కేటీఆర్‌ చొరవతో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటికే 46 చోట్ల సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్థ అమలులో ఉంది. ఇందులో కేంద్రం పాత్ర ఉందనడం అసత్యమే. రూ.50 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం. విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ప్రకటించిన నూతన ఎజెండాతో దిల్లీ ఉలిక్కిపడింది. అందుకే భాజపా నేతలంతా హైదరాబాద్‌కు వచ్చారు. కేసీఆర్‌ కార్యాచరణ భాజపాను కదిలించింది. ఆ పార్టీ నేతలకు ఈ పర్యటన విజ్ఞానయాత్ర కావాలి’’ అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్నిసభలు పెట్టినా జనం నమ్మరు: ఇంద్రకరణ్‌రెడ్డి

‘‘తెలంగాణలో ఇలాంటి పది సభలు పెట్టినా ఇక్కడి ప్రజలు నమ్మరు. పదేపదే రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ విషం కక్కుతున్న భాజపాను తెలంగాణ సమాజం క్షమించదు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదేపదే మాట్లాడటం హాస్యాస్పదం. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చింది. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్‌ గోయల్‌ మొసలి కన్నీరు కార్చారు’’ అని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

భాజపా పరువు పోయింది: శ్రీనివాస్‌గౌడ్‌

‘‘తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిపి.. భాజపా పరువు తీసుకుంది. ఆ పార్టీ నిర్ణయాలు, సభలో మోదీ ప్రసంగం విన్నాక.. భాజపాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్ర విభజన హామీలు, కొత్త ప్రాజెక్టుల అంశాలెన్నో పెండింగ్‌లో ఉన్నా ప్రధాని, కేంద్ర మంత్రులు వాటిగురించి ప్రస్తావించలేదు. ఎంతసేపూ ఎన్నికలు, అధికారం యావే తప్ప ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనే భాజపాకు లేదు’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.

మీరు సాయం చేసిన ప్రాజెక్టులేవీ: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

‘‘తెలంగాణలో అయిదు ప్రాజెక్టులకు సాయం చేశామని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు. దమ్ముంటే ఆ ప్రాజెక్టుల పేర్లు బయటపెట్టాలి. సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పకపోవడం ద్వారా వాటిల్లో ఆయన దోషి అని తేలింది.’’ అని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

మోదీకి సరైన పోటీదారు కేసీఆరే: మంత్రి సబితారెడ్డి

‘‘హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా భాజపా కేంద్ర నాయకత్వం తెలంగాణకు ఏం ఇచ్చిందో భాజపా రాష్ట్ర నాయకులు వివరణ ఇవ్వాలి. మోదీకి సరైన పోటీదారు కేసీఆర్‌ మాత్రమే. ప్రధాని హైదరాబాద్‌ను డైనమిక్‌ సిటీ అన్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చేసిన అభివృద్ధే’’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

అప్పుడు వద్దని... ఇప్పుడు రావాలంటారా?

‘‘కేంద్ర మంత్రి స్మృతిఇరానీ వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం కేసీఆర్‌ను విమర్శించడం దారుణం.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో.., భారత్‌ బయోటెక్‌ సందర్శన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన మోదీ.. సీఎం కేసీఆర్‌ను రావద్దని తమ కార్యాలయం సమాచారం పంపి అవమానపరిచారు. ఇది తెలుసుకోకుండా కేసీఆర్‌.. మోదీకి స్వాగతం పలకలేదని స్మృతిఇరానీ అన్నారు. విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను, నాయకులను కించపరచడం ప్రధాని సహా భాజపా నాయకులకు అలవాటుగా మారింది. ఇకనైనా విషప్రచారం మానుకోవాలి. వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలని స్మృతి ఇరానీకి లేఖ రాశాను’’ అని రాష్ట్ర ప్రణాళిక మండలి ఛైర్మన్‌ వినోద్‌ తెలిపారు.


రూపాయి ఎందుకు పతనమైంది
ట్విటర్‌లో కేటీఆర్‌

దేశంలో రూపాయి పతనం కావడానికి కారణమేమిటని  పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి ఆదివారం ట్విటర్‌లో కేటీ రామారావు ప్రశ్నించారు. ‘‘భాజపాకు చెందిన ఉత్తర కుమారులు ఎవరి దగ్గరైనా ఈ ప్రశ్నకు సమాధానం ఉందా’’ అని పేర్కొన్నారు.

* హైదరాబాద్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తున్న భాజపా.. ముందుగా అహ్మదాబాద్‌ పేరును ఆదానీబాద్‌గా మార్చాలని కేటీఆర్‌ అన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ నేత ఒకరు మాట్లాడుతూ, భాజపా అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని చెప్పిన విషయాన్ని ఒక నెటిజన్‌ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి స్పందించి పైవ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని