Amit Shah: తెరాస సర్కారును కూకటివేళ్లతో పెకిలించాలి

ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో కమల వికాసం తథ్యమన్నారు.

Updated : 04 Jul 2022 08:49 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

ఈనాడు, హైదరాబాద్‌: ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో కమల వికాసం తథ్యమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఏర్పడిందని, ఈ మూడూ మీకు అందాయా? అని విజయ సంకల్ప సభలో ఆయన ప్రజలను ప్రశ్నించారు. ‘వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కేది కేటీఆర్‌కు కాదు భాజపాకే. తెరాస గుర్తు కారే అయినా స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉంది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ లేకుంటే హైదరాబాద్‌ భారతదేశంలో ఉండేది కాదు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించే ధైర్యం కేసీఆర్‌కు లేదు. ఒవైసీ అంటే ఉన్న భయమే ఇందుకు కారణం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. ప్రభుత్వం కూలిపోతుందని ఎవరో జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి కేసీఆర్‌ ఎనిమిదేళ్లుగా సచివాలయానికి రావడంలేదు. వచ్చే ఎన్నికల తర్వాత ఆయన అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అసలు అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా? అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో మూడు కొత్త రాష్ట్రాలు ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పడ్డాయి. కానీ కాంగ్రెస్‌ విభజించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సమస్యలు ఎప్పటికీ తీరేలా కనిపించడం లేదు. మోదీ సారథ్యంలో దేశమంతా అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే తెలంగాణ మాత్రం వెనక్కి పోతోంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాల్సిన అవసరముంది’ అని అమిత్‌షా అన్నారు.
 


కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారింది: నడ్డా

కాళేశ్వరం నిర్మాణ వ్యయాన్ని రూ.32 వేల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు పెంచి.. ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏటీఎంగా మార్చుకున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ ‘నరేంద్రమోదీ గారి నాయకత్వం’ అంటూ ‘వర్ధిల్లాలి’ అని సభికులతో అనిపించి తెలుగులో నడ్డా ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘ఇంత భారీసంఖ్యలో ప్రజలు ఈ సభకు రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. కేసీఆర్‌ అవినీతి పాలనతో ప్రజలు విసుగు చెందారు. భాజపా పాలన తేవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. భాజపా భవిష్యత్తు ఎలా ఉందో ఇక్కడి మీడియా మిత్రులు నాకు చెప్పారు. హైదరాబాద్‌ ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌ను గెలిపించి ధమాకా ఇచ్చారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు పట్టం కట్టారు. అలాగే వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణను గెలిపించాలి. యువతకు ఉపాధి పేరిట కేసీఆర్‌ కుమారుడు, కుమార్తెకు ఉద్యోగాలిచ్చి తెరాస కారును నింపేయడంతో తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. కేంద్ర పథకాలను మార్చేసి అవినీతికి పాల్పడుతున్నారు. తెలంగాణలో సైతం కేంద్ర పథకాలతో అభివృద్ధి చెందాలి’ అని నడ్డా అన్నారు.


మోదీ సారథ్యం.. కమల వికాసం
-ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌

తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోంది. భాజపాను నిలువరించాలని కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇలాంటివాటిని పటాపంచలు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటింది. ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ కమలం వికసించే సమయం త్వరలోనే రానుంది. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగింపు పలకడంతో పాటు భాజపాపై జరుగుతున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. ప్రధాని నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో సురక్షిత, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కొనసాగుతోంది. మోదీ నాయకత్వంలో భాజపా సర్కారు వల్లే సుపరిపాలన సాధ్యమవుతోంది. అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. కొత్తమార్గంలో పయనిస్తోంది. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కొనసాగుతోంది. కేంద్ర పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 6 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా అందుతోంది. కరోనా కాలంలో గత 28 నెలలుగా 15 కోట్ల మందికి నెలకు రెండుసార్లు ఉచితంగా రేషన్‌ అందించే కార్యక్రమం కొనసాగుతోంది. మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణలో భాజపా సర్కారు ఏర్పడితే రాష్ట్రాభివృద్ధికి మావంతు సాయం అందిస్తాం.


తెలంగాణలోనూ మోదీ తరహా ప్రభుత్వం రావాలి
-కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

రాష్ట్రంలో ప్రతి పల్లెలోనూ ప్రజలు భాజపా ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. తెరాసపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో తెరాస అరాచక పాలనను ప్రజలు భరించే స్థితిలో లేరు. కేసీఆర్‌, కేటీఆర్‌లకు సమాధానమిచ్చేందుకు ఇంత భారీగా తరలివచ్చిన భాజపా శ్రేణులకు అభివందనాలు. గత 8 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోంది. రైతులకు అవమానం జరిగింది. నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. వీటిన్నింటినీ అధిగమించేందుకు ఏకైక ప్రత్యామ్నాయం భాజపా సర్కారు. మోదీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తున్నారు. ఆయన నాయకత్వంలో దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. అలాంటి ప్రభుత్వం తెలంగాణలోనూ రావాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు వచ్చిన ఫలితాలు ప్రారంభం మాత్రమే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఇది వెల్లువలా ఉప్పొంగుతుంది. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోంది. అవినీతి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? దీనికి సమాధానాలు కేసీఆర్‌, కేటీఆర్‌, మంత్రులు చెప్పాల్సిందే. ఈ అరాచక.., ఫామ్‌హౌస్‌ పాలన ఇంకెంత కాలం? రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌లు పెద్దపెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు. భాజపా అభ్యర్థిని ఓడిస్తామని శపథం చేస్తున్నారు. అయితే ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. పీడిత వర్గాల ప్రతినిధికి ఎనలేని గౌరవం దక్కనుంది. 


మీ ఫాంహౌస్‌ పాలన.. మేం నేర్చుకోవాలా?
- కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

తెలంగాణ ద్రోహుల్ని వెంటబెట్టుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి భాజపా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలారా భాజపాను ఆశీర్వదించండి. మా పార్టీ అధికారంలోకొస్తే మెరుగైన, నీతివంతమైన పాలన అందిస్తాం. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం భాజపా నేతలు హైదరాబాద్‌కు వస్తుంటే.. తమను చూసి నేర్చుకోవాలంటూ కల్వకుంట్ల కుటుంబం ప్రకటనలు చేస్తోంది. కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని చూసి ఏం నేర్చుకోవాలి..? నెలలో 20 రోజులు ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్న వ్యక్తి నుంచి నేర్చుకోవాలా..? కుటుంబ, అవినీతి రాజకీయాలు, మజ్లిస్‌ చేతిలో కీలుబొమ్మలా మారడం, ఎనిమిదేళ్లుగా సచివాలయానికి రాకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం గురించి తెలుసుకోవాలా?అబద్ధాలు, అక్రమాలు, అహంకారపూరిత పాలన నేర్చుకోవాలా?


కేంద్రం నిధులిస్తుంటే.. కేసీఆర్‌ సర్కారు సహకరించట్లేదు
- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కేంద్రం నిధులిస్తుంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించని తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించాలో వద్దో ప్రజలు ఆలోచించాలి. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు అవకాశం ఇవ్వాలి. సమస్యలు, కష్టాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలు, నిరుపేదల్లో భరోసా కల్పించేందుకే సమావేశాలు పెట్టాం. లాఠీఛార్జీలు చేసినా, కేసులు పెట్టి జైలుకు పంపినా, రౌడీషీట్లు తెరిచినా భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అంటూ ప్రజలకోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే సమావేశాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌ గడ్డ మీద భాజపా సమావేశాలు ఎందుకు పెట్టకూడదో జవాబివ్వాలి. మోదీ సభకు యువత తరలివస్తుంటే కేసీఆర్‌ భయపడుతున్నారు. సీఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. తెలంగాణ అభివృద్ధికి నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటే ఎందుకు సహకరించడం లేదు. కేసీఆర్‌ రాష్ట్రాభివృద్ధిని కోరుకోకుండా.. కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. మోదీ నిధులిస్తుంటే దారి మళ్లిస్తున్నారు. ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల అప్పు మోపారు. పేదల కోసం కష్టపడి పనిచేస్తున్న భాజపాకే తెలంగాణను పాలించే అధికారముంది. దేశ ప్రజలకు 200 కోట్ల డోసుల కరోనా టీకా, రేషన్‌ ఉచితంగా ఇచ్చినందుకు మోదీని విమర్శిస్తున్నారా? దేశంతో పాటు యావత్‌ ప్రపంచం ప్రధానిని స్వాగతిస్తుంటే తెరాస నేతలకు మాత్రం మోదీ గొప్పతనం తెలియడం లేదు.


దేశాన్ని మోదీ శక్తిమంతం చేస్తున్నారు

దేశవ్యాప్తంగా భాజపా బలంగా విస్తరిస్తోంది. దేశాన్ని శక్తిమంతం చేయాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకు వెళుతున్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వ చిత్తశుద్ధితో దేశంలో జాతీయ రహదారులు సహా మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. చైనా సరిహద్దులోనూ మౌలిక సదుపాయాలను పెంచాం. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 70 ఏళ్ల దేశ చరిత్రలో గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తున్నాం. వాజ్‌పేయీ హయాంలో అబ్దుల్‌కలాంను, మోదీ హయాంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన పార్టీ ఇప్పుడు గిరిజన మహిళకు అవకాశం ఇచ్చింది. ఇది భాజపా చిత్తశుద్ధి.

- రవిశంకర్‌ ప్రసాద్‌ కేంద్ర మాజీ మంత్రి


తెలంగాణలో యూపీ తరహా బుల్డోజర్‌

రాష్ట్రంలో అవినీతి పాలనను కూకటివేళ్లతో పెకలించడానికి ఉత్తర్‌ప్రదేశ్‌ తరహా బుల్డోజర్‌ తెలంగాణలో రాబోతోంది. యూపీ తరహా పాలన హైదరాబాద్‌కు రావాలన్నా.. తెలంగాణ సస్యశ్యామలం అవ్వాలన్నా భాజపా ప్రభుత్వం రావాలి. అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజానీకానికి ఆశాకిరణం భాజపానే. మతోన్మాద మజ్లిస్‌, కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాల్ని, తెరాస కుటుంబ పాలనను ఎదుర్కొనే సత్తా భాజపాకే ఉంది.

- లక్ష్మణ్‌, రాజ్యసభ సభ్యుడు


తెలంగాణ సింహాసనంపై కాషాయ దళం

తెలంగాణలో కాషాయ విప్లవం కనిపిస్తోంది. కేసీఆర్‌ సమయం ముగిసింది. ప్రజాతీర్పును అవమానించిన ఆయన సింహాసనం ఖాళీ చేయాలి. లేకపోతే ఇక్కడి ప్రజలే కాషాయ దళాన్ని సింహాసనంపై కూర్చోబెడతారు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ మా ప్రభుత్వం ఏర్పడాలనే సంకల్పాన్ని నాయకత్వం తీసుకుంది. ఇక్కడ మెజార్టీ సాధించి కుటుంబ పార్టీ, అవినీతికి అంతం పలుకుదాం.

-మురళీధర్‌రావు, భాజపా ఇన్‌ఛార్జి, మధ్యప్రదేశ్‌


మీది చిన్న పార్టీ.. ఆ విషయం మరవద్దు

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ మొహం చూసి విసుగెత్తిపోయారు. ఒక చిన్న పార్టీగా ఉన్న మీరు.. దేశంలో భాజపాకు 18 మంది ముఖ్యమంత్రులున్న విషయం మర్చిపోవద్దు. మోదీ చిత్రం ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై లేకున్నా 135 కోట్ల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశ చరిత్రలో తొలిసారి గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి భాజపా గౌరవిస్తోంది. దళితుల్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఎన్నికలయ్యాక ఆయనే పీఠమెక్కారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న పార్టీ నేతల్ని ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తారా..? ఈ గడ్డ మీద భాజపాను కచ్చితంగా గెలిపించుకుంటాం.

- ఈటల రాజేందర్‌, భాజపా ఎమ్మెల్యే


రామరాజ్యం రావాలి

తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది. ప్రజల కష్టాలు పోవాలంటే ఇక్కడ రామరాజ్యం రావాలి. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగుల్ని.. రుణమాఫీ పేరిట రైతుల్ని.. రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాల పేరిట గిరిజనుల్ని కేసీఆర్‌ మోసం చేశారు. పట్టాలడిగిన ఆదివాసీలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. 

- సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్‌


ఓటుబ్యాంకు రాజకీయాల వల్లే అత్యాచారాలు

భాజపా నేతలు భాగ్యనగరానికి వస్తుంటే సీఎం, ఆయన కుమారుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతిగా గిరిజన మహిళను ఎన్నుకుంటుంటే చూడలేక విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ సరఫరాలు ఎక్కువయ్యాయి. ఓటుబ్యాంకు రాజకీయాలు, ఎంఐఎంను నెత్తిన ఎక్కించుకోవడం వల్లే బాలికలపై జరిగే బలాత్కారాల్ని పోలీసు వ్యవస్థ ఆపలేకపోతోంది.

- ధర్మపురి అర్వింద్‌, ఎంపీ నిజామాబాద్‌


కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు

భాజపా సమావేశాలతో కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భాజపా గ్రామాల్లో బలపడుతుంటే చూడలేక కేంద్రంపై కేసీఆర్‌ అభియోగాలు మోపుతున్నారు. రెండుసార్లు మోసపోయిన ప్రజలు ఆయన్ను ఇంటికి పంపాలని నిర్ణయించారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామంటూ ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. 

- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని