Updated : 04 Jul 2022 06:14 IST

దేశీ జాతి.. ఉత్పత్తి నాస్తి

కృత్రిమ వీర్య నమూనాలకు కొరత

రాష్ట్రంలోని ఏకైక ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రానికి గ్రహణం

మేలుజాతి గిత్తల సంరక్షణపై ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో నిత్యం అవసరమైనన్ని పాలు ఉత్పత్తి కావడం లేదు. దీంతో డెయిరీలు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల లీటర్లు కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. దేశీజాతి ఆవులు, గేదెల పాల వినియోగంపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా రాష్ట్రంలో అలాంటి పశువుల ఉత్పత్తిని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కరీంనగర్‌లో ఉన్న గిత్తల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రానికి జీవ భద్రత సమస్యలు ఏర్పడుతున్నాయని ‘రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ’(ఎల్‌డీఏ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ కేంద్రం ఆవరణలోనే దేవాలయం, కూరగాయల మార్కెట్‌ వంటి వాటితో పాటు, ఇతర నిర్మాణాలూ వెలుస్తుండటంతో మేలుజాతి గిత్తల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతేడాది 10 ఒంగోలు జాతి గిత్తలను తీసుకురాగా.. వాటికి రోగాలు సోకడంతో వీర్య నమూనాలు సేకరించకుండా వదిలేశారు. కేంద్రంలో ప్రస్తుతం 132 మేలైన గిత్తలున్నాయి. వాటిలో ఒక దేశీజాతి ఒంగోలు, మూడు సాహివాల్‌, 10 మేహసని జాతికి చెందిన గిత్తల నుంచే వీర్య నమూనాలు సేకరిస్తున్నారు. మిగతావన్నీ సంకర జాతి రకాలే. ఇక్కడి నుంచి ఘనీకృత వీర్య నమూనాలు తీసుకెళ్లి.. పాడి పశువులకు ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తే మేలైన పాడి పశువులు జన్మిస్తాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2014-15లో ఇతర రాష్ట్రాల నుంచి వీర్య నమూనాలు తెచ్చినా ఏటా 14 లక్షల పశువులకు మాత్రమే ఇవ్వగలిగారు. ఇప్పుడు 19 లక్షల నమూనాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి సాధించారు. కానీ, వీటిలో దేశీజాతి గిత్తలు లేక ఆ జాతి పశువులు ఉత్పత్తి కావడం లేదు. దేశీజాతి ఆవుల ఉత్పత్తికి గుజరాత్‌కు చెందిన గిర్‌, సాహివాల్‌, ఏపీకి చెందిన ఒంగోలు జాతి గిత్తల వీర్య నమూనాల ఇంజెక్షన్లను తమ పాడి ఆవులకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, అవి తగినన్ని దొరకడం లేదని గోపాలమిత్ర ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. దేశీజాతి పాడి పశువుల ఉత్పత్తికి రైతుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని.. వాటికన్నా అధిక పాల దిగుబడినిచ్చే హెచ్‌ఎఫ్‌, జెర్సీ, ముర్రా తదితర సంకర జాతి గిత్తల వీర్య నమూనాలను ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు ఎల్‌డీఏ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం ఏర్పడిన తరవాత ఇచ్చిన వీర్య నమూనాల ఇంజెక్షన్లతో 22.50 లక్షల సంకరజాతి దూడలు పుట్టాయని.. వాటి విలువ రూ.4,500 కోట్లని ఈ సంస్థ అధ్యయనంలో తేలింది. రోజుకు 10 లీటర్ల వరకూ పాలు ఇచ్చే సంకర జాతి పశువుల ఉత్పత్తితో గత ఎనిమిదేళ్లలో రూ.16,425 కోట్ల విలువైన 41 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని ప్రభుత్వానికి తెలిపింది. రంగారెడ్డి జిల్లా కంసాన్‌పల్లిలో మరో ఘనీకృత గిత్తల వీర్య ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు ‘ఈనాడు’కు తెలిపారు.

తెలంగాణలో ఉన్న ఏకైక గిత్తల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రం ఇది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1982 జులై 12న కరీంనగర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో 596.30 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు. మేలుజాతి గిత్తలకు ఏ రోగాలు సోకకుండా ఉండేందుకు.. 3 కిలోమీటర్ల దూరం వరకూ ఎలాంటి జనావాసాలు లేకుండా సంరక్షించే ఉద్దేశంతో ఇన్ని ఎకరాలు ఇచ్చారు. కానీ, ఇందులో శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 ఎకరాలు, పలు ప్రభుత్వ విభాగాలకూ స్థలాలు కేటాయించడం వల్ల 384.07 ఎకరాలు వాటి చేతుల్లోకి వెళ్లిపోయింది. 212.23 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఇక్కడున్న గిత్తలకు జీవభద్రత కరవై రోగాలపాలై నాణ్యమైన వీర్యం ఉత్పత్తి కష్టంగా మారింది. ఫలితంగా నాణ్యమైన అధిక పాల దిగుబడినిచ్చే దేశీజాతి ఆవులు, గేదెలను ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశం నీరుగారిపోతోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని