Published : 04 Jul 2022 06:07 IST

హక్కు దక్కదు.. అప్పు పుట్టదు

ఎసైన్డ్‌, ఇనాం లబ్ధిదారులకు తప్పని కష్టాలు

కొత్త పాసుపుస్తకాల జారీలో జాప్యం

విధిలేని పరిస్థితుల్లో అగ్గువకే విక్రయం

ఈనాడు, హైదరాబాద్‌: వారి చేతిలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉంది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. కానీ అయిదేళ్లుగా ఆ భూములపై హక్కులు లేక, రుణాలు పొందలేక, రైతుబంధు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఎసైన్డ్‌, ఇనాం భూముల లబ్ధిదారుల పరిస్థితి ఇది. ఈ భూముల్లో ప్రస్తుతం వానాకాలం పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అప్పు పుట్టక ఆయా రైతులు అవస్థలు పడుతున్నారు. 2017 సెప్టెంబరు ముందు వరకు ఈ భూములకు పాత పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయి. భూదస్త్రాల ప్రక్షాళన అనంతరం రెవెన్యూశాఖ వీటిలో చాలా భూములకు కొత్త పట్టా పుస్తకాలు జారీ చేయలేదు. భూముల వివరాలను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేయలేదు. దీంతో వీరికి సమస్యలు మొదలయ్యాయి. 

ప్రభుత్వం ఇచ్చినవని చెప్పి..

ఈ భూములు.. ప్రభుత్వం పేదలకు కేటాయించినవి కావడంతో చాలా జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం కొత్త పాసుపుస్తకాలు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇనాం భూములకు అధీన హక్కు పత్రం (ఓఆర్‌సీ) జారీచేసిన చోట కూడా నేటికీ కొత్త పాసుపుస్తకాలు అందలేదు. కొన్ని జిల్లాల్లో ఇనాం భూముల లబ్ధిదారుల ఖాతాలను రెవెన్యూ దస్త్రాల నుంచి పూర్తిగా తొలగించారు. 

అగ్గువకే విక్రయాలు

పాసుపుస్తకాలు అందని రైతులు ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ ప్రకటించిన ప్రతిసారీ వేల మంది మీసేవా కేంద్రాలకు ఆశతో వస్తున్నారు. ఆ భూముల సర్వే నంబరు, ఖాతా నంబరు సైతం ఆన్‌లైన్‌లో లేకపోవడంతో వారి దరఖాస్తులను పోర్టల్‌ స్వీకరించడం లేదు. దీంతో విసిగిపోతున్న బాధితులు.. కుటుంబ అవసరాలకు దిక్కులేని పరిస్థితుల్లో భూములను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో ఈ విధంగా వందల ఎకరాల విస్తీర్ణం చేతులు మారుతోంది. బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ.20 లక్షలు ఉండగా.. ఈ భూములు రూ.3 లక్షలు కూడా పలకడం లేదు. 2018 నాటికి రాష్ట్రంలో 2.41 లక్షల ఎకరాల ఎసైన్డ్‌ భూములు చేతులు మారినట్లు అధికారిక సమాచారం ఉంది. కొత్త పాసుపుస్తకాలు అందక ఈ నాలుగేళ్లలోనూ పెద్ద ఎత్తున భూమిని పేదలు విక్రయించినట్లు అంచనాలు ఉన్నాయి. 

ఆన్‌లైన్‌లో సమాచారం ఉంచాలని విన్నపాలు

ప్రభుత్వం కొత్త పాసుపుస్తకాలు జారీచేసే వరకు ఎసైన్డ్‌ భూముల లబ్ధిదారులు, వారి తరువాత వారసత్వంగా హక్కులు పొందిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో, ధరణి పోర్టల్‌లో ప్రత్యేక గవాక్షంలో (విండో) చేర్చాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనివల్ల హక్కుదారులు ప్రైవేటుగానైనా అప్పులు తీసుకునేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ధరణి పోర్టల్‌కు ముందు వెబ్‌ల్యాండ్‌ వెబ్‌సైట్‌లో ఇదేతీరులో హక్కుదారుల వివరాలు ఉండేవని గుర్తు చేస్తున్నారు. అనేక జిల్లాల్లో ప్రజావాణికి వస్తున్న దరఖాస్తుల్లో ఇలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని