తెలంగాణ పోరాట యోధుడు అలుగుబెల్లి కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు అలుగుబెల్లి వెంకటనర్సింహారెడ్డి(97) సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌లోని తన ఇంట్లో ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు

Published : 04 Jul 2022 06:17 IST

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు అలుగుబెల్లి వెంకటనర్సింహారెడ్డి(97) సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌లోని తన ఇంట్లో ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సభ్యుడిగా రెండు దశాబ్దాలపాటు కొనసాగారు. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్యాసంస్థలను బహిష్కరించి సాయుధ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. సూర్యాపేట ప్రాంత దళానికి నాయకత్వం వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రజాకార్లు పలు దఫాలు దాడులు జరిపి కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనానికి వచ్చిన ఇండియన్‌ యూనియన్‌ బలగాలు కమ్యూనిస్టులపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ.. అందుకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి వెంకటనర్సింహారెడ్డి నాయకత్వం వహించారు. 1951లో పోరాట విరమణపై న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 1967లో నక్సల్బరీ పంథాలోకి ప్రవేశించారు. చండ్ర పుల్లారెడ్డి, అలుగుబెల్లి యలమారెడ్డి, గోపాల్‌రెడ్డి, కాకి లక్ష్మారెడ్డిలను ప్రజా ఉద్యమాల దిశగా ప్రోత్సహించారు. నాలుగుసార్లు తుమ్మలపెన్‌పహాడ్‌ సర్పంచిగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని