15 రోజులకోసారి కోర్‌ కమిటీ భేటీ

జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న భాజపా అగ్రనేతలు రాష్ట్ర నాయకులకు కీలక సూచనలు చేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే

Updated : 05 Jul 2022 06:23 IST

అందరూ కలిసి పనిచేయండి
భాజపా రాష్ట్ర నేతలకు అమిత్‌షా సూచన

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న భాజపా అగ్రనేతలు రాష్ట్ర నాయకులకు కీలక సూచనలు చేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘‘తెలంగాణలో మనం అధికారంలోకి రాబోతున్నాం. ప్రతి 15 రోజులకోసారి రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోండి. అందులో చర్చించి పార్టీ కార్యక్రమాల జోరు పెంచండి. నాయకులందరూ కలిసి పనిచేయండి. కార్యక్రమాల్లో అందర్నీ భాగస్వాముల్ని చేయండి’’ అని అమిత్‌షా సూచించారు.

హైదరాబాద్‌లో తెరాస ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భాజపాను చూస్తే తెరాసకు భయం పుడుతోంది. అందుకే పోటీగా హోర్డింగులు పెట్టింది. నగరంలో సీఎం ఫొటోలు చూసి నాకు స్వాగతం పలుకుతున్నారనుకున్నా’’ అని నడ్డా అన్నారని పార్టీ నేత ఒకరు తెలిపారు. సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో బండి సంజయ్‌, రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, తూళ్ల వీరేందర్‌గౌడ్‌ తదితరులతో నడ్డా ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రయత్నించినా ఆశలు పెట్టుకోలేదు. 2023నాటికి అధికారంలోకి వస్తామని అనుకున్నా. ఇప్పుడా నమ్మకం ఏర్పడింది’’అంటూ నేతలతో పేర్కొన్నారు.

బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయాలి

భాజపాను దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని జేపీ నడ్డా సూచించారు. అన్ని రాష్ట్రాల సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శులతో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నడ్డా సోమవారం సమావేశమయ్యారు. సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వచ్చే మూడు, నాలుగు దశాబ్దాల పాటు కేంద్రంలో భాజపా అధికారంలో ఉండాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పోలింగ్‌ బూత్‌లు, శక్తికేంద్రాల స్థాయి నుంచి బలపరచాలని నడ్డా, ఇతర నేతలు సూచించారు. కార్యకర్తల సంఖ్య పెంచాలని, వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి నాయకులు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని నడ్డా చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా పదాధికారులు, జిల్లా ఇన్‌ఛార్జీలు, ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో మంగళవారం సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఉదయం హైదరాబాద్‌లో సంజయ్‌ అధ్యక్షతన జరిగే తెలంగాణ సమావేశంలో కిషన్‌రెడ్డి, తరుణ్‌ ఛుగ్‌, శివప్రకాశ్‌, డీకే అరుణ, లక్ష్మణ్‌ తదితర నేతలు, రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు