అల్లూరి, కుమురం భీంల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి

వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని.. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మనదేశంలో పుట్టినందుకు అందరం గర్వపడాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. వెన్నుమీద కాదు.. గుండె మీద

Published : 05 Jul 2022 05:49 IST

వెన్నుమీద కాదు.. గుండె మీద కాల్చమన్న సీతారామరాజు
జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్‌

రాంనగర్‌, న్యూస్‌టుడే:  వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడేనని.. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మనదేశంలో పుట్టినందుకు అందరం గర్వపడాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. వెన్నుమీద కాదు.. గుండె మీద కాల్చమని ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహానుభావుడు అల్లూరి అని పేర్కొన్నారు. సీతారామరాజు, తెలంగాణ మన్యం వీరుడు కుమురం భీంల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్ని ప్రతికూలతలు, కుట్రలెదురైనా వాటిని ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఉద్యమకారులను కేసీఆర్‌ ఎప్పుడూ మరిచిపోరని చెప్పారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ అల్లూరి బ్రిటిష్‌వారిపై పోరాడగా... జల్‌-జంగల్‌-జమీన్‌ నినాదంతో కుమురం భీం తెలంగాణ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువుపై పోరాటం సాగించారని కొనియాడారు. క్షత్రియ భవన్‌ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ మూడెకరాల భూమిని కేటాయించారన్నారు. త్వరలో భవన నిర్మాణం చేపట్టి, దానికి అల్లూరి పేరు పెడతామని కేటీఆర్‌ చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ, అల్లూరి గొప్ప వీరుడని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా... తెలంగాణ ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.


దొడ్డి కొమురయ్యకు నివాళులు


 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీ రామారావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, కె.చందర్‌, రేఖానాయక్‌, దుర్గం చిన్నయ్య, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజులు పాల్గొన్నారు.

ఘనంగా కాకతీయ వైభవ సప్తాహం

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7 నుంచి 7 రోజుల పాటు వరంగల్‌లో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తుందని పరిశ్రమలు, సాంస్కృతిక శాఖల మంత్రులు కేటీ రామారావు, శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని, కాకతీయుల ప్రాశస్త్యాన్ని చాటేలా వేడుకల కోసం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సప్తాహం నిర్వహణపై సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులిద్దరూ సన్నాహక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించేలా సప్తాహం నిర్వహించాలన్నారు. అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళాకార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనేలా ఉత్సవాలు జరపాలని, అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. వేడుకల సందర్భంగా వరంగల్‌ను సర్వాంగ సుందరంగా, విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పర్యాటకసంస్థ ఎండీ మనోహర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని