జైలులో జన్మించిన కృష్ణభారతికి ప్రధాని పాదాభివందనం

అల్లూరి జయంత్యుత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ.. సభ అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల కుమార్తెలు పసల కృష్ణభారతి, డా.పసల వీణతోపాటు వారి మేనకోడలు భోగిరెడ్డి

Published : 05 Jul 2022 08:39 IST

ఈనాడు, భీమవరం: అల్లూరి జయంత్యుత్సవాలలో పాల్గొన్న ప్రధాని మోదీ.. సభ అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల కుమార్తెలు పసల కృష్ణభారతి, డా.పసల వీణతోపాటు వారి మేనకోడలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిలను కలిసి ముచ్చటించారు. ‘స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబంలో పుట్టడం అదృష్టం.. శాసనోల్లంఘన ఉద్యమంలో మీ తల్లి అంజలక్ష్మి జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పుట్టడం.. జైలులోనే మీ అన్నప్రాశన జరగడం గొప్ప విషయం.. చంటిబిడ్డగానే శిక్ష అనుభవించారు.. మీ ఆశీస్సులు అదృష్టంగా భావిస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ వారితో పేర్కొన్నారు. కృష్ణ భారతికి ఆయన పాదాభివందనం చేశారు. ‘నేను గర్భంలో ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపారు.. వారి పోరాట ఫలితంగానే మాకు ఖ్యాతి లభించింది’ అంటూ కృష్ణభారతి ప్రధానితో ఆనందాన్ని పంచుకున్నారు.  ప్రధాని మాతృమూర్తి యోగక్షేమాలను కృష్ణభారతి అడిగి తెలుసుకున్నారు.  ప్రధాని స్పందిస్తూ కాశీకి రండి.. విశ్వేశ్వరుణ్ని దర్శించుకోండి అని ఆహ్వానించారు. ప్రధానికి కొండపల్లి బొమ్మను కానుకగా ఇవ్వగా..  ఆయన శాలువాతో కృష్ణభారతిని  సత్కరించారు.  కృష్ణభారతి మేనకోడలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రధానితో ముచ్చటించే క్రమంలో తెలుగువారున్న భుజ్‌ ప్రాంతంలో 2002లో పది రోజులు పార్టీ తరఫున పని చేశానని.. కచ్‌లో భూకంపం వచ్చినప్పుడు పునరావాస కార్యక్రమంలో సేవలు అందించానని గుర్తుచేశానన్నారు.


‘మా నాన్న పసల కృష్ణమూర్తి భీమవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంపై ఉన్న బ్రిటిష్‌ జెండా తొలగించి.. త్రివర్ణ పతాకం ఎగుర వేశారు. ఆయనను అరెస్టుచేసి చెన్నై  జైలుకు తీసుకెళ్లారు. అనంతరం నాన్నను తిరుచానూరు, అమ్మను రాయవేలూరు జైళ్లకు తరలించారు. నేను జైల్లోనే పుట్టాను. అన్నప్రాశన, నామకరణం అక్కడే చేశారు. పది నెలల వయసు వరకు అక్కడే ఉన్నాను.’            

- పసల కృష్ణభారతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని