Updated : 05 Jul 2022 08:46 IST

డ్రైవర్‌ లేకుండానే రయ్‌.. రయ్‌

భవిష్యత్‌ సాంకేతికతపై హైదరాబాద్‌ ఐఐటీ ప్రయోగాలు
దేశంలో తొలిసారి వేదిక ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌ లేకుండా వాహనాలను నడిపే సాంకేతికతలపై ప్రయోగాలకు వేదికను(టెస్ట్‌బెడ్‌) అందుబాటులోకి తెచ్చింది. జాతీయ మిషన్‌లో భాగంగా ఇక్కడ సైబర్‌ ఫిజికల్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం టీహాన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భవిష్యత్తు నావిగేషన్‌ వ్యవస్థలతో పాటు మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు రూపొందిస్తున్నారు. డ్రైవర్‌ లేకుండా వాహనాలు నడిపే సాంకేతికతకు రూపునిచ్చే క్రతువులో ఆచార్యులు రాజలక్ష్మి నేతృత్వంలో 40 మందికి పైగా యువ పరిశోధకులు భాగస్వాములవుతున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో గొప్ప మార్పులు వస్తాయని పరిశోధకులు తెలిపారు.  

2 కి.మీ. ట్రాక్‌ ఏర్పాటు

ఇక్కడ ఏర్పాటు చేసిన టెస్ట్‌బెడ్‌లో 2 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను రూపొందించారు. సాధారణ రహదారుల మీద ఉండే అన్ని రకాల పరిస్థితులను ఇక్కడ ఏర్పాటు చేసి ఆరు నెలలుగా పరిశోధనలు చేస్తున్నారు. డ్రైవర్‌ లేకుండా కారును నడిపించి పరీక్షించారు. మనుషులను మోసుకెళ్లే డ్రోన్‌కు ఒక రూపమిచ్చారు. మనుషులు కూర్చునే క్యాబిన్‌ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ డ్రోన్‌ బరువును రానున్న రోజుల్లో మరింత తగ్గిస్తామని పరిశోధక విద్యార్థులు తెలిపారు. వ్యవసాయంలో వినియోగించే రకరకాల డ్రోన్ల తయారీకి కృషి చేస్తున్నారు. సోమవారం ఇక్కడికి వచ్చిన కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌.. పరిశోధనల గురించి తెలుసుకుని ప్రశంసించారు. రెండోతరం ఐఐటీల్లో ఒకటైన ఐఐటీహెచ్‌ ఆవిష్కరణల రంగంలో దూసుకుపోతున్న తీరును ఆయన అభినందించారు.

‘‘డ్రైవర్‌ సాయం లేకుండానే జీపీఎస్‌, సెన్సార్‌, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా రహదారులపై, ఆకాశంలో వాహనాలు, డ్రోన్లు వెళ్లేలా పరిశోధనలు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చిన్ననాటి నుంచే భవిష్యత్తు సాంకేతికతపై అవగాహన పెంచేలా కొన్ని రకాల కిట్లనూ రూపొందిస్తున్నాం. వాటిని ప్రభుత్వ బడులకు తీసుకెళ్లి ప్రదర్శిస్తున్నాం’’ అని టీహాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.రాజలక్ష్మి తెలిపారు.


ఐఐటీహెచ్‌లో స్వయం చాలక వాహన వేదిక ప్రారంభం

ఈనాడు, సంగారెడ్డి: దేశంలోనే తొలిసారి డ్రైవర్‌ రహిత వాహనాల సాంకేతికత అభివృద్ధికి ఐఐటీ హైదరాబాద్‌లోని టీహాన్‌లో ప్రయోగ వేదికను (టెస్ట్‌బెడ్‌) సిద్ధం చేశారు. సోమవారం కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ దీనిని ప్రారంభించారు. అనంతరం డ్రైవర్‌ లేకుండా నడిచే వాహనంలో 50 మీటర్ల దూరం ప్రయాణించారు. ఈ పరిశోధనలకు కేంద్రం రూ.135 కోట్లు కేటాయించినట్లు ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌మూర్తి తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్‌.చంద్రశేఖర్‌, ఐఐటీ బోర్డ్‌ఆఫ్‌ గవర్నర్స్‌ అధ్యక్షుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆచార్యులు పి.రాజలక్ష్మి, పరిశోధన, అభివృద్ధి విభాగం డీన్‌ ఆచార్య కిరణ్‌కూచి తదితరులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని