Published : 05 Jul 2022 05:52 IST

బోధన సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ వెల్లడి
కేసీఆర్‌కు రాజ్యాంగంపై గౌరవం లేదని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌- ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలిపారు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని దాదాపు 9 వేల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో రూ.62.80 కోట్లతో నిర్మించిన డిజిటల్‌ లెర్నింగ్‌, శిక్షణ వనరుల సెంటర్‌, భౌతికశాస్త్రం, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ వేదికగా భారత్‌ బయోటెక్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు కావడం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

గవర్నర్‌ కులపతిగా ఉండడమే సరైనది

రాష్ట్ర వర్సిటీలకు కులపతుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు రాష్ట్రపతి, రాష్ట్ర వర్సిటీలకు గవర్నర్‌ కులపతులుగా ఉండటమే సరైన వ్యవస్థ అన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పలుమార్లు సూచించినట్లు ధర్మేంద్రప్రధాన్‌ చెప్పారు. ‘‘ఎన్‌ఈపీతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఈ విషయంలో తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఏం అభ్యంతరం ఉందో చెప్పాలి. ప్రాథమిక స్థాయిలో బోధన.. స్థానిక భాషల్లో ఉండాలని పాలసీ చెబుతోంది. మీరు దీనిని వ్యతిరేకిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.

ప్రభుత్వం భూములు లాక్కొంటోంది: కులపతి

కులపతి జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి మాట్లాడుతూ అందరికీ హెచ్‌సీయూ సున్నిత లక్ష్యంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం భూములు లాక్కొంటోందని చెప్పారు. ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.

జగన్‌ను చూసి తెలుసుకోవాలి..

ప్రధానిని ఏ విధంగా గౌరవించాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుసుకోవాలని ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. హెచ్‌సీయూలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మరిచిపోకూడదు. మోదీని ఈ దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఏపీ సీఎం జగన్‌ ఏ తరహాలో ప్రధానికి ఆహ్వానం పలికారో.. అదే తరహాలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి గౌరవం ఇవ్వాలి. కానీ, కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతామని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌ ఒక ముంగరీలాల్‌’’ (హిందీ సీరియల్‌లో ఓ జోకర్‌) అని వ్యాఖ్యానించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని