సంక్షిప్త వార్తలు

ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశకు తిరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు

Published : 05 Jul 2022 05:52 IST

వీఆర్వోల నిరసన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్వో)ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లకు వీఆర్వోలు వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో సమావేశమై వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడం, రెండేళ్లుగా జాబ్‌చార్టు లేకుండానే విధులు కేటాయించడం, కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం, పదోన్నతులు, ఉద్యోగ సర్దుబాటుపై నాన్చివేత ధోరణి అవలంబించడం, తదితర సమస్యలపై దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.


దివ్యాంగులకు రేషన్‌కార్డులు

ఈనాడు, హైదరాబాద్‌: అంగవైకల్యం 40 శాతం ఉన్నవారు ఆహార భద్రత కార్డును పొందేందుకు అర్హులని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. రేషన్‌కార్డు దరఖాస్తుతో అంగవైకల్య ధ్రువీకరణ పత్రాన్ని ఈ-పీడీఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంగవైకల్యాన్ని సరిదిద్దుకున్న పక్షంలో రేషన్‌కార్డులో సవరణలు చేసుకునేందుకూ వెసులుబాటు కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


జరిమానా లేకుండా ట్రేడ్‌ లైసెన్స్‌ల రెన్యువల్‌కు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ట్రేడ్‌ లైసెన్స్‌లను ఎలాంటి జరిమానా లేకుండా అక్టోబరు వరకు రెన్యువల్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌లను రెన్యువల్‌ చేసుకోకుండా వ్యాపారం చేస్తూ జూన్‌లోపు చేసుకుంటే 25 శాతం, జూన్‌ తర్వాత అక్టోబరులోపు అయితే 50 శాతం జరిమానా చెల్లించాల్సి ఉండేది. తాజా ఉత్తర్వులతో అక్టోబరు వరకు ఎలాంటి జరిమానా లేకుండా రెన్యువల్‌ చేసుకునేలా పురపాలకశాఖ అవకాశం కల్పించింది. ఇప్పటికే ఏప్రిల్‌ ఒకటి తర్వాత జరిమానాలు చెల్లించి రెన్యువల్‌ చేసుకున్నవారికి ఆ మొత్తాన్ని వచ్చే ఏడాది రెన్యువల్‌ సమయంలో సర్దుబాటు చేయనున్నట్లు ఆ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


18 నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్లు

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఐసెట్‌-2022 హాల్‌టికెట్లను 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) తెలిపింది.


కొత్తగా 443 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 443 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 8,02,822కు పెరిగింది. తాజాగా మరో 493 మంది కోలుకోగా ఇప్పటి వరకూ 7,94,014 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 4న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,697 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21,918 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 3,57,07,773కు చేరింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 247 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 30, సంగారెడ్డిలో 27, ములుగులో 15, ఖమ్మం జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 15,061 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.


స్విట్జర్లాండ్‌కు నీటిపారుదల ఇంజినీర్ల బృందం

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ బృందంలో ఉన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో అదనపు టీఎంసీ తరలింపు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపుహౌసుల్లో మోటార్లకు బిగించే విద్యుత్‌ ఉపకరణాలను  పరిశీలించనున్నట్లు సమాచారం.  


నేడు, రేపు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌-బెజ్జూరు, న్యూస్‌టుడే: ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశకు తిరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెంటీమీటర్లు, పాతరాజంపేట(కామారెడ్డి)లో 12.8, పొచ్చెర(ఆదిలాబాద్‌)లో 10.4. నెన్నెల(మంచిర్యాల)లో 9.7, సోనాల(ఆదిలాబాద్‌)లో 9.4, జైనూర్‌(ఆసిఫాబాద్‌)లో 9.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా హైదరాబాద్‌ నగరంతోపాటు సంగారెడ్డి, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686 అడుగులకు చేరింది.


ఖమ్మం పోలీసులకు హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అన్నం శ్రీనివాసరావుపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఖమ్మం పోలీసులకు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్నం ఫౌండేషన్‌ అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేయడంలేదని, దీన్ని సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీసీ తరగతుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్‌ కె.లలిత విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు చేయడంలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అదే కేసులో పిటిషనర్‌ నిందితుడిగా ఉంటూ పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించారు.


సింగరేణి అమ్మకాల్లో 36 శాతం వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ మొదటి త్రైమాసికం (గత ఏప్రిల్‌, మే, జూన్‌) అమ్మకాలలో గత ఏడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధిని సాధించింది. సోమవారం సింగరేణి భవన్‌ నుంచి అన్ని ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా త్రైమాసిక ఉత్పత్తి, ప్రగతిపై సమీక్ష జరిపారు. దేశంలో బొగ్గుకు కొరత ఏర్పడిన నేపథ్యంలో సమర్థంగా బొగ్గును ఉత్పత్తి చేసి, వినియోగదారులకు అందించడంతో టర్నోవర్‌ సాధించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రూ.5,374 కోట్ల అమ్మకాలు జరపగా ఈ ఏడాది 36 శాతం వృద్ధితో రూ.8,670 కోట్లకు పెరిగింది. ఇది దేశంలోని ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థలు సాధించిన దానికన్నా అత్యధికమన్నారు. ఈ మూడు నెలల కాలంలో బొగ్గు అమ్మకం ద్వారా రూ.7,598 కోట్లు, విద్యుత్తుపై రూ.1,062 కోట్ల అమ్మకాలు సాధించామన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రూ.12 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ మాత్రమే నమోదు చేసిన సింగరేణి ఈ ఏడాది సుమారు రూ.34 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయన్నారు.


నేడు ప్రభుత్వ ఆమోదానికి క్రమబద్ధీకరణ దస్త్రం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 3,584 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ దస్త్రాన్ని మంగళవారం ఇంటర్‌ విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించనుంది. అధ్యాపకుల జాబితా దస్త్రంపై సోమవారం రాత్రి ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ సంతకం చేశారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే వారు ఇక రెగ్యులర్‌ అధ్యాపకులుగా మారనున్నారు.


మరో 532 మంది ఉపాధ్యాయుల పరస్పర బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 532 మంది ఉపాధ్యాయులను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పరస్పర బదిలీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో మొత్తం 2,558 మంది నుంచి 1,279 దరఖాస్తులు అందగా వారిని బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాము నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసినా.. ఎందుకు అనుమతి రాలేదని పలువురు టీచర్లు మొరపెట్టుకోవడంతో విచారణ జరిపారు. పలు దరఖాస్తులు గల్లంతైనట్లు ఆ విచారణలో తేలింది. వాటిని మళ్లీ ఆయా జిల్లాల నుంచి తెప్పించుకొని ప్రభుత్వానికి పంపారు. ఈ క్రమంలో 532 మంది(266 దరఖాస్తులు)కి అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇంకా దాదాపు 1,400 మంది దరఖాస్తు చేసుకున్నా.. సర్వీస్‌ విషయంలో హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా పాటిస్తామని అంగీకార పత్రం ఇవ్వకపోవడంతో వారికి అనుమతి లభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు