రాష్ట్రానికి మరిన్ని వన్‌స్టాప్‌ కేంద్రాలు

రాష్ట్రంలో మహిళలపై వేధింపుల నిరోధానికి, వారి పునరావాసానికి అవసరమైతే మరికొన్ని ‘వన్‌స్టాప్‌ కేంద్రాలు’ మంజూరు చేస్తామని, ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ సూచించారు.

Published : 05 Jul 2022 05:49 IST

కేంద్ర మంత్రి స్మృతిఇరానీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలపై వేధింపుల నిరోధానికి, వారి పునరావాసానికి అవసరమైతే మరికొన్ని ‘వన్‌స్టాప్‌ కేంద్రాలు’ మంజూరు చేస్తామని, ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. తెలంగాణకు మంజూరు చేసిన 36 కేంద్రాల్లో 33 పని చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విధానాలను అమలు చేసినప్పుడు మహిళల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు. సోమవారమిక్కడ ‘ఎనిమిదేళ్ల విజయాలు - మహిళలు, చిన్నారుల్లో మార్పు’’ అంశంపై జరిగిన సబ్‌జోనల్‌ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి బేటీ బచావో.. బేటీపడావో, పీఎంకేర్స్‌, శక్తివన్‌స్టాప్‌ కేంద్రాలు, పీఎం మాతృత్వ వందన యోజన, పోషణ్‌ అభియాన్‌ పథకాలపై సమీక్ష నిర్వహించారు. వేధింపులకు గురైన మహిళలకు వన్‌స్టాప్‌ కేంద్రాలతో అవసరమైన వైద్య, న్యాయ సహాయంతో తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మహిళా సంక్షేమం కోసం ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌, బాలరక్షక్‌ వాహనాలు, బాలామృతం తదితర పథకాలను కేసీఆర్‌ అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి, నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది వేతనాల్లో కేంద్ర వాటాను 25 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని