15 నుంచి రెవెన్యూ సదస్సులు

మిగిలిన ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. భూ సమస్యలపై మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రులు,

Published : 06 Jul 2022 02:57 IST

  మిగిలి ఉన్న భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

  11న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో అవగాహన సదస్సు

  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: మిగిలిన ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. భూ సమస్యలపై మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు శేషాద్రి, రిజ్వి, రాహుల్‌ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి సమస్యలు, క్షేత్రస్థాయిలో భూ సమస్యల మూల కారణాలపై చర్చించారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. దీనికోసం మండలం కేంద్రంగా సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేయాలని, సంయుక్త కలెక్టర్‌, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రైతుల సమస్యలను నమోదు చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో సమావేశాలను నిర్వహించాలని పేర్కొన్నారు. సదస్సుల నిర్వహణపై అవగాహన సమావేశం ఈ నెల 11న ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరుకానున్నారు. భూ సమస్యలపై గురువారం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం పది నుంచి గంటన్నర పాటు దృశ్యశ్రవణ మాధ్యమంలో సీఎస్‌ మాట్లాడనున్నారు. కలెక్టర్లకు వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, మిగిలి ఉన్నవాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని