Published : 06 Jul 2022 05:58 IST

ఉలుకూపలుకూ లేని కేంద్రం!

బియ్యం సేకరణపై 25 రోజులుగా స్పందించని వైనం

ధాన్యం వేలం వేయడమా? బియ్యంగా మార్చడమా?

రాష్ట్రం మల్లగుల్లాలు.. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం

సమస్యలపై రేపు మిల్లర్ల భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: బియ్యం సేకరణ పునరుద్ధరణపై గడిచిన 25 రోజులుగా కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదు. లేఖ రాసినా, అధికారుల బృందాన్ని పంపినా స్పందించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. చట్టపరంగా ముందుకుపోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపైనా అడ్వొకేట్‌ జనరల్‌తో పౌరసరఫరాల శాఖ  మంతనాలు సాగిస్తోంది. రాష్ట్రంలో ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున ఉండటంతో వేలం వేయటం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు.. నష్ట తీవ్రత తదితర అంశాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయాలు చర్చించేందుకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఒకట్రెండు రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  మరోపక్క ధాన్యం క్వింటా ఒక్కింటికి రూ. 1,700లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమంటూ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ పౌరసరఫరాల శాఖకు లేఖ ఇచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ధరలు తక్కువగా ఉండటంతో వారు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు.. మిల్లుల ప్రాంగణాల్లోని ధాన్యం నిల్వలు వర్షాలకు తడుస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని నిర్ణయించిన రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ గురువారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది.

వేలం వేస్తే...

ధాన్యం వేలం వేస్తే సుమారు క్వింటాకు రూ.400-500 వరకు నష్టం వస్తుందని అధికారుల అంచనా. తొలుత నిర్ణయించిన ప్రకారం రూ.మూడు వేల కోట్ల వరకు నష్టాన్ని భరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారని మంత్రులు చెబుతున్నారు. ఆ నష్టం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేలం వేసినా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం రాష్ట్ర మిల్లర్లకు ఉందా? ఆ మేరకు చెల్లింపులకు ఎంత మంది ముందుకు వస్తారు.. కొద్ది మొత్తాల్లో వేలం వేస్తే మిగిలిన వడ్లను ఏమి చేయాలి.. అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వేలం అనంతరం మిల్లర్ల నుంచి ఆయా మొత్తాలను రాబట్టలేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గ్లోబల్‌ టెండర్ల ద్వారా వేలం వేస్తే స్పందన ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పోటీ పెరిగి మంచి ధర రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

బియ్యంగా మారిస్తే....

ఎటూ రూ.మూడు వేల కోట్ల నష్టానికి సిద్ధమైన నేపథ్యంలో ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయిస్తే ఎలా ఉంటుందన్నది మరో ఆలోచనగా ఉంది. ఈ నెల 15 నాటికి నూకల కింద చెల్లించాల్సిన నష్టం అంచనాలపై నివేదిక వస్తుందని... అప్పటి దాకా వేచి ఉండాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఒకవేళ బియ్యం తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ముందుకు వస్తే క్వింటాకు రూ. మూడు వేల వరకు చెల్లిస్తుంది. నష్టం కొంత మేరకు తగ్గుతుంది. వీటన్నింటిపై అధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఏం జరుగుతుందో మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని