ప్రతిష్ఠాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం

తెలంగాణ పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానమైనదని, కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టత భావితరాలకు తెలిపేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాకతీయ వైభవంపై ప్రత్యేక

Published : 06 Jul 2022 05:58 IST

 మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానమైనదని, కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టత భావితరాలకు తెలిపేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాకతీయ వైభవంపై ప్రత్యేక తపాలా స్టాంపు విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్‌ వేదికగా ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహం బ్రోచర్‌ను సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘కాకతీయ వేడుకల్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నాం. కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంపై నిపుణులతో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తాం. కళాకారులను, కవులను సన్మానిస్తాం’ అని తెలిపారు.

‘కేసీఆర్‌- రాజకీయ కళ’ పుస్తకావిష్కరణ

అనితర సాధ్యుడు, తెలంగాణ సాధకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొంతమంది అహంకారంతో ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌కు చెందిన రచయిత చిమ్మని మనోహర్‌ రాసిన ‘కేసీఆర్‌- రాజకీయ కళ (ఆర్ట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌) పుస్తకాన్ని మంగళవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘గత అరవైయ్యేళ్లుగా కలగా మిగిలిన తెలంగాణను కేసీఆర్‌ సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారు. ఇంత చేస్తుంటే కొంతమంది అభివృద్ధి నిరోధకులు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో రచయిత మనోహర్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్‌ అధినేత పరమేశ్వర్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్‌ మీడియా సంచాలకుడు దిలీప్‌ కొణతం పాల్గొన్నారు.


ముఖ్రా-కె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ అభివృద్ధికి ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా-కె గ్రామం ముఖచిత్రం వంటిదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘ప్రతి ఇంటికి సంక్షేమం - ప్రతి ఇంటికి కేసీఆర్‌’ పేరుతో ముఖ్రా గ్రామంలో చేపట్టిన ప్రచారం అభినందనీయమని, మిగిలిన గ్రామాలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామ సర్పంచి గాడ్గే మీనాక్షి మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలవగా, ఆయన అభినందించి సత్కరించారు. ‘గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ. 34 కోట్ల నిధులను మంజూరు చేసిన వివరాలతో గ్రామంలో ఫ్లెక్సీ పెట్టడం అభినందనీయం. పల్లెప్రగతి ద్వారా జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా ముఖ్రా నిలిచింది. ఈ గ్రామాభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని