Updated : 07 Jul 2022 06:50 IST

పాటకు పట్టం.. కథకు వందనం

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలకూ అవకాశం

రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ చేసిన కేంద్రం

నలుగురూ దక్షిణాది వారే

ఈనాడు, దిల్లీ: దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించిన కథారచయిత/దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)లను రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు నామినేట్‌ చేసింది. పరుగుల రాణిగా పేరొందిన పి.టి.ఉష (కేరళ), ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్గడే (కర్ణాటక)లకూ అదే కోటాలో ఎగువ సభకు అవకాశం కల్పించింది. ఈ నలుగురూ దక్షిణాది వారే కావడంతో.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో దక్షిణ భారతీయులను అధికార పక్షం విస్మరించిందంటూ వస్తున్న విమర్శలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశముంది. ఈ నలుగురు తమ రంగాలకు దశాబ్దాలుగా విశేష సేవ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. అందుకు గుర్తింపుగానే వారిని రాజ్యసభకు నామినేట్‌ చేసినట్లు పేర్కొంది.

కథావిజయేంద్రుడు

విజయేంద్రప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో 1947 మే 27న జన్మించారు. విజయవాడ లయోలా కాలేజీలో చదువుకున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈయన కుమారుడే. భజరంగీ భాయిజాన్‌, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తదితర సూపర్‌హిట్‌ చిత్రాలకు విజయేంద్రప్రసాద్‌ కథలు అందించారు. తెలుగు జాతి ఖ్యాతిని, భారతీయ చిత్రసీమ సత్తాను వాటితో ప్రపంచానికి చాటారు.  భజరంగీ భాయిజాన్‌ సినిమాకు 2016లో ఈయన ఉత్తమ కథారచయితగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

సినీ సంగీత సామ్రాట్‌

ఇళయరాజా తమిళనాడులోని మదురై జిల్లాలో దళిత కుటుంబంలో జన్మించారు. భారతీయ సినిమా సంగీత సామ్రాట్‌గా గుర్తింపు పొందారు. అయిదు దశాబ్దాల కెరీర్‌లో వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. 7 వేలకు పైగా పాటలు సృష్టించారు. 2018లో ఈయన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అయిదు జాతీయ సినిమా అవార్డులు, సంగీత నాటక అకాడమీ అవార్డులూ పొందారు.

పరుగుల రాణి

కేరళలో కోజికోడ్‌ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన ఉష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన పరుగుతో ట్రాక్‌పై పతకాల పంట పండించారు. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’గా పేరొందారు. కెరీర్‌లో ఎన్నోసార్లు జాతీయ, కామన్వెల్త్‌, ఆసియా రికార్డులు బద్దలుకొట్టారు. 1984 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో 400మీ హర్డిల్స్‌లో సెకనులో వందో వంతు తేడాతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతో సహా 11 పతకాలు గెలిచారు. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఏకంగా 14 పసిడి పతకాలు అందుకున్నారు.పరుగుకు వీడ్కోలు పలికాక ఉషా స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ను ప్రారంభించి ఛాంపియన్లను తీర్చిదిద్దే బాధ్యత చేపట్టారు. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు పొందారు.

ధర్మస్థల ధర్మాధికారి

వీరేంద్ర హెగ్గడే 20వ ఏట నుంచే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్‌డీసెటీ) ఏర్పాటుతో గ్రామీణ యువతకు చేయూతనందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 6 లక్షల స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయానికి ధర్మాధికారి ఈయన. ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు నేతృత్వం వహిస్తూ.. వేల మంది చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2015లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు.


ప్రధాని అభినందనలు

రాజ్యసభకు నామినేట్‌ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌, పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలను ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘‘వి.విజయేంద్రప్రసాద్‌ దశాబ్దాల తరబడి సృజనాత్మక ప్రపంచంతో మమేకమై ఉన్నారు. ఆయన వల్ల అద్భుతమైన భారతీయ సంస్కృతి ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. రాజ్యసభకు నామినేట్‌ అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘సృజనాత్మక మేధావి ఇళయరాజా తన సంగీత మేధస్సుతో తరతరాలను ఆనంద డోలికల్లో ఊపుతున్నారు. ఆయన పని ఎన్నో భావోద్వేగాలను ప్రతిబింబించింది. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’’ అని ఇళయరాజాను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, సంస్కృతుల అభ్యున్నతికి వీరేంద్ర హెగ్గడే గొప్ప కృషిచేస్తున్నారని కీర్తించారు. క్రీడారంగంలో పి.టి.ఉష చూపిన ప్రతిభాపాటవాలు జగద్విదితమని పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని