మరోసారి గ్యాస్‌ మంట

సామాన్యులపై మరోసారి ధరల బండపడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మళ్లీ వంట గ్యాస్‌ధర భగ్గుమంది. తాజాగా రూ.50 పెంచటంతో గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండరు

Published : 07 Jul 2022 02:38 IST

 గృహావసర సిలిండరు ధర రూ. 50 పెంపు

24 నెలల్లో రూ. 418.50 భారం

ఈనాడు, హైదరాబాద్‌: సామాన్యులపై మరోసారి ధరల బండపడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మళ్లీ వంట గ్యాస్‌ధర భగ్గుమంది. తాజాగా రూ.50 పెంచటంతో గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండరు ధర హైదరాబాద్‌లో రూ.1,105కు ఎగబాకింది. నామమాత్రంగా ఇస్తున్న రాయితీ సొమ్మును కూడా రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.వంట గ్యాస్‌ ధర అంచనాలకు మించి పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై భారీగా భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల ఆధారంగా ప్రతి నెలా ఒకటో తేదీన చమురు సంస్థలు సిలిండరు ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తాయి. అయితే గత సంవత్సరం ఒకే నెలలో రెండు సార్లు పెంచిన సందర్భాలూ ఉన్నాయి. గడిచిన ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ధర పెంపుదలకు కేంద్రం బ్రేకులు వేసింది. గత నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చి నుంచి ధరల ఫిరంగులు మోగుతూనే ఉన్నాయి.

నెలకు రూ.29 కోట్ల భారం

గడిచిన ఏడాది వ్యవధిలో సిలిండరుపై రూ.193 భారం పెరిగింది. రెండేళ్ల వ్యవధిలో రూ.418.50 పెరిగింది. మూడు నెలలుగా చడీచప్పుడు లేకుండా ఉన్న చమురు సంస్థలు ఒకసారిగా సిలిండరుపై రూ.50 పెంచటంతో కంగు తినటం ప్రజల వంతవుతోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 55 లక్షల సిలిండర్లు వినియోగమవుతాయి. తాజా పెంపుతో నెలకు వినియోగదారులపై రూ. 27.50 కోట్ల నుంచి రూ.29 కోట్ల వరకు భారం పడనుంది. దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన పథకం కింద సుమారు 34 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వారికి మాత్రం రూ.241.50లను రాయితీగా కేంద్రం జమ చేస్తోంది. దీంతో వారు సిలిండరుకు రూ.863.50 చెల్లించినట్లు అవుతుంది. రానున్న రోజుల్లో సిలిండరు ధర మరింత పెరుగుతుందన్న ప్రచారం సాగుతోంది. కేంద్రం దశలవారీగా భారం తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉండటమే ఇందుకు కారణమని గ్యాస్‌ డీలర్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చమురు సంస్థలు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పాయని డీలర్‌ ఒకరు బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే సిలిండరుపై ఉన్న రూ. 220 భారాన్ని తగ్గించుకునే క్రమంలోనే తాజాగా రూ.50 భారాన్ని వినియోగదారులపై మోపిందని చెబుతున్నారు. మిగిలిన భారం కూడా పడక తప్పదని డీలర్లు అంటున్నారు.

వంటింట్లో మంట.. మహిళలకు మోదీ కానుక

ఈనాడు, హైదరాబాద్‌: గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచి కేంద్రం వంటింట్లో మంట పెట్టిందని, సిలిండర్‌ ధర పెంచి దేశ మహిళలకు మోదీ కానుకగా ఇచ్చేశారని మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. మోదీ నిర్వాకంతో ఇక మంచిరోజులు వచ్చేశాయ్‌.. అందరికీ శుభాకాంక్షలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గృహావసరాల సిలిండర్‌పై కేంద్రం రూ.50 పెంచిందంటూ ఒక నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని