‘శాఫ్రాన్‌’తో వైమానిక పరిశ్రమకు ఊతం

ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ ‘శాఫ్రాన్‌’ తెలంగాణలో రూ.1,200 కోట్లతో విమాన ఇంజిన్ల నిర్వహణకు మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌(ఎంఆర్‌వో) కేంద్రం ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో

Published : 07 Jul 2022 03:09 IST

మంత్రి కేటీఆర్‌ హర్షం

రూ. 1200 కోట్లతో ఏర్పాటు

నేడు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ ‘శాఫ్రాన్‌’ తెలంగాణలో రూ.1,200 కోట్లతో విమాన ఇంజిన్ల నిర్వహణకు మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌(ఎంఆర్‌వో) కేంద్రం ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో హర్షం వ్యక్తంచేశారు. భారత్‌లో తమ తొలి ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకమని, సంస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనని, మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజిన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్‌ ఏర్పాటు చేయనున్న ఎంఆర్‌వో కేంద్రంతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. ‘‘భారత్‌తో పాటు విదేశీ వాణిజ్య విమానాల్లో వాడే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజిన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. శాఫ్రాన్‌ ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని వైమానిక పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది. తెలంగాణ ఏరోస్పేస్‌ వ్యాలీగా మారుతుంది. అగ్రశ్రేణి సంస్థ అయిన శాఫ్రాన్‌ పెడుతున్న భారీ పెట్టుబడితో ఏరోస్పేస్‌ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న     సంగతి మరోసారి రుజువైంది’’ అని వివరించారు. శాఫ్రాన్‌ సంస్థ ఫొటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌కు జతచేశారు.

* శాఫ్రాన్‌ సంస్థ శంషాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోసిటీలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌వో కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు.

టీవర్క్స్‌ భవనం త్వరలో ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టీవర్క్స్‌ సొంత భవనం త్వరలోనే ప్రారంభమవుతుందని, అది రాష్ట్రంలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో వెల్లడించారు. టీవర్క్స్‌ ద్వారా ఆవిష్కరణల రంగంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు.

గుజరాత్‌లో బుల్‌డోజర్లు లేవా?

గుజరాత్‌లోని భవనాల్లో 35 శాతం అక్రమ నిర్మాణాలేనని, అక్కడ బుల్‌డోజర్లను ఎందుకు ఉపయోగించడం లేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఒక నెటిజన్‌ గుజరాత్‌లో అక్రమ నిర్మాణాలపై కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా ఆయన పైవిధంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని