సంక్షిప్త వార్తలు

తెలంగాణలో నాలుగు రాష్ట్రస్థాయి సివిల్స్‌ స్టడీ సర్కిళ్లతో పాటు జిల్లా స్థాయుల్లో 132 స్టడీసర్కిళ్లు, అన్ని జిల్లాల్లో బీసీ గురుకులాలు, మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్రమంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌లు హర్షం వ్యక్తంచేశారు.

Published : 07 Jul 2022 04:23 IST

స్టడీసర్కిళ్లు, గురుకులాల ఏర్పాటుపై మంత్రుల హర్షం

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణలో నాలుగు రాష్ట్రస్థాయి సివిల్స్‌ స్టడీ సర్కిళ్లతో పాటు జిల్లా స్థాయుల్లో 132 స్టడీసర్కిళ్లు, అన్ని జిల్లాల్లో బీసీ గురుకులాలు, మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్రమంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌లు హర్షం వ్యక్తంచేశారు.


తొలి త్రైమాసికంలో 2,306 ఎంయూ విద్యుదుత్పత్తి: సింగరేణి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో 2,306 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుదుత్పత్తి, 88 శాతం ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టర్‌తో సింగరేణి విద్యుత్కేంద్రం దేశంలోని ప్రభుత్వ థర్మల్‌ కేంద్రాల్లో మొదటిస్థానంలో నిలిచిందని ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం రాష్ట్ర విద్యుత్తు వాడకంలో తమ సంస్థ నుంచి సరఫరా అయ్యేది 12 శాతమున్నట్లు వివరించింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద గల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం 2,306 ఎంయూల విద్యుదుత్పత్తి చేసింది. సింగరేణి భవన్‌లో బుధవారం థర్మల్‌, సౌరవిద్యుత్కేంద్రాల పనితీరుపై సీఎండీ సమీక్షించారు. తొలి త్రైమాసికంలో విద్యుత్కేంద్రం రూ.111 కోట్ల లాభాలనార్జించిందని ఆయన తెలిపారు.


డ్రోన్ల విడిభాగాల తయారీకి.. రెండు తెలంగాణ సంస్థల ఎంపిక

ఈనాడు, దిల్లీ: ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌(పీఎల్‌ఐ) పథకం కింద డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాల ఉత్పత్తి కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ దేశవ్యాప్తంగా 23 సంస్థలను ఎంపిక చేసింది. వీటిలో 12 డ్రోన్లు, 11 డ్రోన్ల విడిభాగాలు తయారు చేసే సంస్థలు ఉన్నాయి. డ్రోన్ల విడిభాగాల తయారీకి తెలంగాణకు చెందిన డైనమిక్‌ ఇంజినీరింగ్‌-హైదరాబాద్‌, అదానీ-ఎల్బిట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఇండియా-హైదరాబాద్‌ సంస్థలు ఎంపికయ్యాయి.


విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు అందించాలి: మంత్రి సత్యవతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, పుస్తకాలు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలను వెంటనే అందించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. బుధవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాకొకటి చొప్పున స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని