పోలీసుల వాదన విని నిర్ణయించండి

ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసుల వాదన వినకుండా వారిని నిందితులుగా చేర్చుతూ ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం హైకోర్టు రద్దు చేసింది. మృతుల భార్యలు

Published : 07 Jul 2022 05:49 IST

ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసుల వాదన వినకుండా వారిని నిందితులుగా చేర్చుతూ ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం హైకోర్టు రద్దు చేసింది. మృతుల భార్యలు దాఖలు చేసిన పిటిషన్లపై పోలీసుల వాదన వినకుండా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతోపాటు పోలీసులపై కేసును విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవాలంటూ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో చట్టబద్ధత, ఔచిత్యం లేవని పేర్కొంది. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను రద్దు చేయడానికి కారణాలనూ పేర్కొనలేదంది. పోలీసులకు నోటీసులు జారీ చేసి, వారి వాదనను పరిగణనలోకి తీసుకుని తిరిగి నిర్ణయాన్ని వెలువరించాలంటూ ఆదేశించింది.

ఏమిటీ కేసు?

2010 జులైలో ఆదిలాబాద్‌ జిల్లా సర్కేపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజాద్‌ అలియాస్‌ చెరుకూరి రాజ్‌కుమార్‌, జర్నలిస్టు హేమచంద్ర పాండేలు మరణించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు నిర్వహించింది. ఫిర్యాదుదారులు పేర్కొన్నట్లు పోలీసులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని నివేదిక దాఖలు చేసింది. పోలీసుల బూటకపు ఎన్‌కౌంటర్‌పై ఆధారాలున్నాయని కె.పద్మ, బినీత పాండేలు మేజిస్ట్రేట్‌ వద్ద పిటిషన్‌ (ప్రొటెస్ట్‌) దాఖలు చేయగా కొట్టివేశారు. వారు ఆదిలాబాద్‌ జిల్లా కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను అనుమతిస్తూ 29 మంది పోలీసులను నిందితులుగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. వీటితో పాటు కేసును కొట్టివేయాలంటూ పోలీసు అధికారులు రఘునందన్‌రావు, మరో 28 మంది హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం 68 పేజీల తీర్పు వెలువరించారు. నోటీసులు అవసరంలేదన్న ప్రతివాదుల వాదనను తోసిపుచ్చారు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను సమీక్షించేముందు జిల్లా కోర్టు పరిధి పరిమితమని పేర్కొన్నారు.  పోలీసులకు నోటీసు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా వారిపై కేసును విచారణకు స్వీకరిస్తూ జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  సీబీఐ నివేదికను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై పోలీసులకు నోటీసులు ఇచ్చి తిరిగి విచారణ చేపట్టాలని జిల్లా కోర్టుకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విచారణ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ.. పోలీసుల పిటిషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని