Published : 07 Jul 2022 05:49 IST

గుత్తేదారులతో చర్చించండి!

‘మన ఊరు - మన బడి’ పనులపై విద్యాశాఖకు సీవోటీ సూచన

ఎక్కువ ధరలకు కోట్‌చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలోనే..

ఈనాడు హైదరాబాద్‌: మన ఊరు - మన బడి కార్యక్రమం కింద ఫర్నిచర్‌ కోసం పిలిచిన టెండర్లలో మార్కెట్‌ ధరలను పరిగణనలోకి తీసుకొని గుత్తేదారులతో సంప్రదింపులు జరపాలని కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) విద్యాశాఖకు సూచించినట్లు తెలిసింది. పెయింటింగ్‌ మినహా మిగిలిన వాటికి ఎక్కువ ధరను గుత్తేదారులు కోట్‌ చేసిన నేపథ్యంలో సీవోటీ ఈ సూచన చేసినట్లు సమాచారం. మన ఊరు - మన బడి కార్యక్రమం కింద తెలంగాణలో పాఠశాలలను ఆధునికీకరించడం, విద్యార్థులకు అవసరమైన డెస్క్‌లు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ఇతర ఫర్నిచర్‌ కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) టెండర్లు పిలిచింది. ఈ విభాగం ఆధ్వర్యంలోని కమిటీ టెండర్లను పరిశీలించి ఖరారు చేసింది. అయితే, తమకు అర్హత ఉన్నా.. పక్కనపెట్టారని ఆరోపిస్తూ కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టును కూడా ఆశ్రయించారు. పెయింటింగ్‌ పనికి అంచనాపై పది శాతం ఎక్కువగా ఉండగా, మిగిలిన మూడు పనులకు 31 శాతం నుంచి 68 శాతం వరకు ఎక్కువకు కోట్‌ చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఫిర్యాదుల నేపథ్యంలో టెండర్లను సీవోటీకి పంపిన విద్యాశాఖ.. వాటిని పరిశీలించాలని కోరింది. సీవోటీ ఈ టెండర్లపై చర్చించి పెయింటింగ్‌, గ్రీన్‌చాక్‌బోర్డుల అంశాలపై మినిట్స్‌ను పంపించినట్లు తెలిసింది. డ్యుయల్‌ డెస్క్‌లు, ఫర్నిచర్‌ టెండర్లపైనా మినిట్స్‌ పంపనున్నట్లు సమాచారం. స్డాండర్డ్‌ షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)ను పరిగణనలోకి తీసుకొని సీవోటీ టెండర్ల విశ్లేషణ చేసి ఖరారు చేస్తోంది. విద్యాశాఖ పిలిచిన పనుల్లో ఎస్‌ఎస్‌ఆర్‌తో సంబంధం లేనివి ఉన్నందున తాము సూచన మాత్రమే చేయగలమని.. నిర్ణయం తీసుకోవాల్సింది టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలోని కమిటీ మాత్రమేనని సీవోటీ పేర్కొన్నట్లు తెలిసింది. పెయింటింగ్‌ టెండర్‌లో పదిశాతం మాత్రమే ఎక్సెస్‌ ఉన్నందున దీనిపట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని