Updated : 16 Jul 2022 11:41 IST

Monkeypox: మంకీపాక్స్‌పై అప్రమత్తత

మార్గదర్శకాలు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: కేరళలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్‌ ఇప్పటికే 50 దేశాల్లో వ్యాప్తి చెందింది. జనవరి 1 నుంచి జూన్‌ 22 నాటికి 3,413 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతిచెందారు. జంతువుల నుంచి వ్యాప్తి చెందే వైరస్‌ సంబంధిత వ్యాధి ఇది. ఈ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మంకీపాక్స్‌ను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రోగుల నుంచి నమూనాలను సేకరించాలి? వారిని ఎలా గుర్తించాలి? ముందస్తుగా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి? తదితర అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో డీహెచ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు పంపించారు.

వ్యాధిని గుర్తించడమెలా?

శరీరంపై దద్దుర్లు రావడం మంకీపాక్స్‌ ప్రధాన లక్షణం. దీంతో పాటు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చంకల్లో, గజ్జల్లో లింఫుగ్రంధుల్లో వాపు, నీరసం, చలి, చెమట పట్టడం, గొంతునొప్పి, దగ్గు తదితర లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరించాలి. మంకీపాక్స్‌ అనుమానిత నమూనాలను పరీక్షించడానికి దేశం మొత్తమ్మీద 15 ప్రయోగశాలలకు అనుమతివ్వగా.. రాష్ట్రంలో గాంధీలోని ప్రయోగశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. విదేశాల నుంచి వచ్చే వారి నుంచే కాకుండా స్థానికంగా ఉన్న వారిలోనూ లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరించాలని ఆదేశించారు. అయితే అనుమానితుల ప్రయాణ చరిత్రను తెలుసుకోవాలన్నారు.  

వ్యాప్తి ఇలా?

మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే అత్యంత సమీపంగా ఉండి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను పీల్చుకోవడం ద్వారా.. తాకడం, ముద్దు పెట్టుకోవడం, కరచాలనాలు, చెమట, కన్నీళ్లు, తదితర శరీర స్రావాలు, లైంగిక సంపర్కం, బాధితుడు ఉపయోగించిన తువ్వాలు, దుస్తులు తదితర వస్తువులను వాడడం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని విడి గదిలో ఉంచడంతో పాటు సన్నిహితంగా మెలగకూడదు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. మంకీపాక్స్‌పై ఏవైనా అనుమానాలుంటే 90302 27324 నంబరుకు వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. నేరుగా కాల్‌ చేయాలనుకుంటే 040 24651119 నంబరుకు ఫోన్‌ చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు సూచించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని