Updated : 27 Jul 2022 04:55 IST

Parliament: ధరలపై దద్దరిల్లిన ఉభయ సభలు

 జీఎస్టీకి వ్యతిరేకంగానూ పార్లమెంటులో విపక్షాల ఆందోళన

రాజ్యసభలో 19 మంది ఎంపీల సస్పెన్షన్‌

వారిలో ముగ్గురు తెరాస వారే

తృణమూల్‌, డీఎంకే, వామపక్షాల సభ్యులపైనా వేటు

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లాయి. జీఎస్టీ, నిత్యావసరాలు, గ్యాస్‌, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతబట్టి, వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేసి 24 గంటలు కాకముందే... రాజ్యసభలో మంగళవారం 5 పార్టీలకు చెందిన 19 మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటువేశారు. 256వ నిబంధన ప్రకారం ఈ వారంతం వరకూ వీరందర్నీ సస్పెండ్‌ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ నారాయణ్‌సింగ్‌ ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో తెరాస నుంచి ముగ్గురు, తృణమూల్‌ నుంచి ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక సభ్యుడు ఉన్నారు. ఒకేసారి ఇంతమంది సభ్యులపై వేటు వేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి. మంగళవారం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌ నోటీసు ఇచ్చి ప్రజాసమస్యలపై చర్చకు అనుమతించాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడిని కోరారు. ఆయన నిరాకరించడంతో ఇద్దరు సభ్యులు ప్లకార్డులు పట్టుకొని వెల్‌లో ఆందోళన చేపట్టారు. దీంతో ఛైర్మన్‌ సభను 12 గంటలకు వాయిదావేసి వెళ్లిపోయారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ఉపసభాపతి హరివంశ్‌ ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు. ఆ సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. ఎంత వారించినా వినలేదు. మరోసారి వాయిదాపడిన అనంతరం సభ 12.20 గంటలకు పునఃప్రారంభమైంది. అయితే, విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. పెంచిన ధరలను తగ్గించాలని; భాజపా, ప్రధాని జవాబు చెప్పాలని కోరుతూ నినాదాలు, చప్పట్లతో హోరెత్తించారు. ఈ ఆందోళనల మధ్యే డిప్యూటీ ఛైర్మన్‌ ప్రశ్నోత్తరాలను ముందుకు నడిపించారు. తృణమూల్‌ సభాపక్షనేత డెరెక్‌ ఒబ్రియెన్‌ ఆయనకు ఏదో చెప్పబోగా.. మీ సభ్యులను వెల్‌ నుంచి వెనక్కు పిలిపిస్తే తప్ప, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనన్నారు. ఇందుకు ఆయన నిరాకరిస్తూ, తమ పార్టీ సభ్యులను తాను ఆదేశించలేనన్నారు. అలాగైతే, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండని మీరు సభాపతిని కూడా నిర్దేశించలేరని డిప్యూటీ ఛైర్మన్‌ బదులిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత ఎస్పీ సభాపక్ష నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 8 రోజులుగా సభ నడవడంలేదని, ప్రభుత్వ వ్యవహారాలు కూడా సాగడంలేదన్నారు. ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని, ఇందులో పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలన్నారు.

‘తెలంగాణలో వరదలపై చర్చించాలి’

తెరాసనేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే సభా కార్యకలాపాలు చాలారోజులు వృథా అయ్యాయన్నారు. ప్రభుత్వం సభభావనను ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకొని.. ధరల పెరుగుదల, జీఎస్టీ, తెలంగాణలో వరదలపై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీని తర్వాత డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ‘మాస్‌డిస్ట్రక్షన్స్‌ వెపన్స్‌ బిల్లు’పై చర్చకు తెరతీశారు. దీనిపై మాట్లాడేందుకు తొలుత సీపీఎం సభ్యుడు బికాశ్‌ రంజన్‌ భట్టాచార్యకు అవకాశమిచ్చారు. ఆయన లేచి మాస్‌డిస్ట్రక్షన్‌ అన్నది కేవలం ఆయుధాలతోనేకాదు.. ధరల పెరుగుదలతోనూ జరుగుతుందని వ్యాఖ్యానించారు. మీరు చర్చ నుంచి పక్కకు వెళ్తున్నారంటూ హరివంశ్‌ ఆయన్ను అడ్డుకున్నారు. ఇదే సమయంలో వెల్‌లో ఆందోళన చేస్తున్న సభ్యులను మరోసారి హెచ్చరించారు. ఇలాగే కొనసాగిస్తే 256 నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో దీంతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి మురళీధరన్‌... ఆందోళన చేస్తున్న సభ్యుల పేర్లను చదివి; నిబంధనలను, సభా మర్యాదను ఉల్లంఘిస్తున్నారన్నారు. 256 నిబంధన కింద వారిని ఈవారం మిగిలిన రోజులకు సస్పెండ్‌ చేయాలని కోరారు. తీర్మానం ఆమోదం కోసం హరివంశ్‌ సభముందుంచారు. తృణమూల్‌ నేత డెరెక్‌ ఒబ్రియెన్‌ ఓటింగ్‌ కోరగా, సభ సజావుగా లేనందున మూజువాణి ఓటుతో సస్పెన్షన్‌ తీర్మానం ఆమోదం పొందినట్టు ప్రకటించారు. సభను 15 నిమిషాలపాటు వాయిదావేసి వెళ్లిపోయారు. సభ తిరిగి ప్రారంభమైనా, సస్పెండైన సభ్యులు బయటకు వెళ్లలేదు. రెండు వాయిదాల తర్వాత ప్యానల్‌ వైస్‌ఛైర్మన్‌ భువనేశ్వర్‌ కాలితా సభను బుధవారానికి వాయిదావేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో, భారమైన హృదయంతో 19 మందిని సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందని రాజ్యసభాపక్ష నేత పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. భాజపా సర్కారు పార్లమెంటును సస్పెండ్‌ చేసి, అంధకారంలోకి నెట్టిందని ఒబ్రియెన్‌ విమర్శించారు.

సస్పెండ్‌ అయినవారు...

తెరాస: బి.లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు దీవికొండ.

తృణమూల్‌: సుస్మితాదేవ్‌, మౌసమీనూర్‌, శాంతా ఛేత్రి, డోలాసేన్‌, శాంతను సేన్‌, అభిరంజన్‌ బిశ్వాస్‌, నదీముల్‌హఖ్‌.

డీఎంకే: హమమెద్‌ అబ్దుల్లా, కల్యాణ్‌సుందరం, గిర్‌ రంజన్‌, ఎన్‌ఆర్‌ ఎలంగో, ఎం.షణ్ముగం, కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము.

సీపీఎం: వి.శివదాసన్‌, ఏఏ రహీం

సీపీఐ: సంతోష్‌ కుమార్‌.

లోక్‌సభలోనూ అదే ఆందోళన...

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచిందంటూ లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న క్రమంలోనే.. లోక్‌సభలో ఈ గందరగోళం చోటుచేసుకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ను పురస్కరించుకుని, అమరవీరులకు స్పీకర్‌ ఓంబిర్లా నివాళులర్పించారు. అనంతరం విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి... అధిక ద్రవ్యోల్బణం, జీఎస్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. ‘సత్యమేవ జయతే’ నినాదం రాసిన గాంధీ చిత్రపటాలనూ ప్రదర్శించారు.

ఈడీ పాలనను సహించబోమని.., జీఎస్టీ, నిత్యావసరాలు, ఇంధన ధరలను పెంపును వెనక్కు తీసుకోవాలని పట్టుపట్టారు. వీటిపై మాట్లాడేందుకు జీరో అవర్‌లో అనుమతిస్తానని స్పీకర్‌ చెప్పినా వినలేదు. సభ తిరిగి 11:45కు సమావేశం కాగా, డీఎంకే సభ్యులు వెల్‌లోకి వచ్చి, నలుగురు కాంగ్రెస్‌ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. వారంతా రాష్ట్రపతిభవన్‌ వైపు ప్రదర్శన చేపట్టారు. నిరసనలు కొనసాగడంతో సభ మరోమారు వాయిదాపడింది. తమను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ సభ్యులు మండిపడ్డారు.  గాంధీ విగ్రహం ఎదుట మాణికం ఠాగూర్‌, టి.ఎన్‌.ప్రతాపన్‌, జోతిమణి, రమ్యా హరిదాస్‌లు నిరసన వ్యక్తం చేశారు.


ఇదో చీకటిరోజు
తెరాస రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ప్రజా సమస్యలపై చర్చకు అంగీకరించకుండా రాజ్యసభ నుంచి ఎంపీలను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటిరోజు(బ్లాక్‌ డే) అని తెరాస రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాజ్యసభ నుంచి 19 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన అనంతరం తెరాస ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ- తమ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే అధికార పక్షం చర్చకు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. విపక్ష పార్టీలకు చెందిన 19 మందిని సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాష్ట్రాల అంశాలపై చర్చించేందుకు రాజ్యసభ వేదిక కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని కోరితే సస్పెండ్‌ చేశారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ- అప్రజాస్వామికంగా 19 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకునే పనిలోనే మోదీ సర్కార్‌ ఉందని, ఆ నిర్ణయాన్ని తెరాస వ్యతిరేకిస్తోందని చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని