కణజాల ఇన్‌ఫెక్షన్‌ కలకలం

కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ యువకుడు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన గడ్డం అనిల్‌ (37). కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది రోజుల కిందట రాత్రి పూట తీవ్ర చలి జ్వరం రావడంతో

Updated : 05 Aug 2022 05:44 IST

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలో నమోదవుతున్న కేసులు
సరైన సమయంలో చికిత్స పొందాలి
లేకపోతే ప్రాణాంతకమంటున్న నిపుణులు


కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ యువకుడు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన గడ్డం అనిల్‌ (37). కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది రోజుల కిందట రాత్రి పూట తీవ్ర చలి జ్వరం రావడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. తెల్లారేసరికి ఎడమ కాలు వాపు రావడంతో పాటు పొక్కులు వచ్చి చూస్తుండగానే బొబ్బలుగా మారాయి. ఆందోళనకు గురైన ఆయన జిల్లా కేంద్రంలోని వైద్యులను సంప్రదించారు. వారు పరీక్షించి ‘కణజాల ఇన్‌ఫెక్షన్‌(సెల్యులైటిస్‌)’గా నిర్ధారించారు. అప్పటికే కాలంతా ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో కోలుకుంటున్నారు.


ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, కేసముద్రం, న్యూస్‌టుడే:  మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వలలో సెల్యులైటిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధితో గ్రామంలో మరికొంతమంది బాధ పడుతున్నారని, ఇందులో ఒకరు ఇటీవలే మృతి చెందారని గ్రామస్థులు చెబుతున్నారు. 2018లోనూ కల్వలతో పాటు పక్కనే ఉన్న అమీనాపురం, కోమటిపల్లి, వాటి శివారు తండాల్లో ఈ వ్యాధి సోకి పలువురు ఆసుపత్రి పాలవగా.. మళ్లీ ఇప్పుడు బాధితులు ఎక్కువవుతుండడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. కల్వలలో పలువురికి సెల్యులైటిస్‌ వ్యాధి సోకినట్టు తమ దృష్టికి వచ్చిందని మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రి వైద్యుడు వినిల్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ఇంటింటా సర్వే చేపట్టినట్లు కల్వల ఆరోగ్య ఉపకేంద్రం వైద్యురాలు అంజనీశర్మ తెలిపారు.

ఏమిటీ సెల్యులైటిస్‌?

సెల్యులైటిస్‌ అంటే సాధారణ భాషలో శరీరంలోని కణజాలానికి ఇన్‌ఫెక్షన్‌ సోకడం. స్ట్రెప్టొకొకస్‌, స్టాఫిలోకొకస్‌ బ్యాక్టీరియాల కారణంగా సోకే ఒక రకమైన ఇన్‌ఫెక్షన్‌ ఇది. మురుగు నీటిలో కాళ్లు తడవడం, అపరిశుభ్ర వాతావరణంలో ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. కాళ్లకు అప్పటికే గాయాలు, పుండ్లు, కోతలు, కాట్లు ఉన్న వ్యక్తుల్లో.. సులువుగా బ్యాక్టీరియా శరీరం లోనికి ప్రవేశిస్తుంది. ఇటీవల వర్షాలు విపరీతంగా కురుస్తుండడం, వరదలు ముంచెత్తడం తదితర పరిణామాలతో పరిసరాలు అపరిశుభ్రమై.. ఈ వాతావరణంలో బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శరీరంలోని ఏ భాగానికైనా సెల్యులైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకవచ్చు. ఎక్కువగా శరీరంలోని కింది భాగాలకు.. అందులోనూ ముఖ్యంగా కాళ్లకు సోకుతుంది.

లక్షణాలు ఇలా..

నొప్పి సలపడం

ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పి

వాపు, వణుకు

వెచ్చదనంగా అనిపించడం

ఎర్రని, నీలి రంగులో పొక్కులు రావడం

చర్మం ఎర్రబడడం

బొబ్బలు వచ్చి స్రావాలు కారడం

చర్మంపై నొక్కితే గుంటలు పడుతుండడం

జ్వరం, అలసట


త్వరగా గుర్తిస్తే చికిత్స సులభం

- డాక్టర్‌ మనోహర్‌, జనరల్‌ ఫిజీషియన్‌

సెల్యులైటిస్‌ అనేది సాధారణ జబ్బే. అడపాదడపా కేసులు వస్తుంటాయి. అయితే ఒకే ఊరిలో, ఒకేసారి, ఎక్కువమందికి రావడం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసేదే. ముందుగా రాత్రి పూట తీవ్ర చలి జ్వరం వస్తుంది. తర్వాత కాళ్లకు బొబ్బలు వస్తాయి. పుండ్లు ఏర్పడతాయి. రెండు మూడు రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ కాలు మొత్తం విస్తరిస్తుంది. చర్మం పైపొరనే కాకుండా లోపలి చర్మాన్ని కూడా చీలుస్తుంది. అతి వేగంగా కణాల్లో వ్యాప్తి చెందుతుంది. చర్మం ఎర్రగా మారుతుంది. పొక్కులొస్తాయి. పుండుగా మారుతుంది. త్వరగా గుర్తిస్తే చికిత్స సులభమే. సాధారణంగా 2 వారాలు, అవసరమైతే 4-6 వారాలు చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోనికి ప్రవేశించి సెప్టిసీమియా(రక్తంలో ఇన్‌ఫెక్షన్‌)కు దారి తీస్తుంది. తద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదకరంగా మరే అవకాశాలుంటాయి. మురుగునీటిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని