Telangana news: సహజ కాన్పునకు రూ.3వేల ప్రోత్సాహకం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తూ వైద్యఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఒక్కో కాన్పునకు వైద్య సిబ్బందికి రూ.3వేల చొప్పున చెల్లించనుంది. ఈ మేరకు శాఖ కార్యదర్శి రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు

Updated : 06 Aug 2022 05:05 IST

ఆసుపత్రి సిబ్బందికి ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తూ వైద్యఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఒక్కో కాన్పునకు వైద్య సిబ్బందికి రూ.3వేల చొప్పున చెల్లించనుంది. ఈ మేరకు శాఖ కార్యదర్శి రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ అన్ని స్థాయుల దవాఖానాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఏ స్థాయి ఆసుపత్రిలోనైనా 2021-22 సంవత్సరంలో ఎన్ని సహజ కాన్పులు చేశారనేది లెక్కించి.. అందులో 85 శాతాన్ని మైలురాయిగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కనీసం 85 శాతం సహజ కాన్పులను చేయాల్సి ఉంటుంది. అందుకే 85 శాతం కంటే అధికంగా చేసిన ఇలాంటి కాన్పులను లెక్కించి, ఒక్కోదానికి రూ.3వేల చొప్పున అందజేస్తారు. తద్వారా ప్రభుత్వ వైద్యంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించినట్లు అవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏయే స్థాయి ఆసుపత్రుల్లో సగటున నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి? అందులో సహజమైనవి ఎన్ని? అనే కసరత్తు పూర్తిచేశారు. నెలకు బోధనాసుపత్రుల్లో 350, జిల్లా ఆసుపత్రులు, మాతాశిశు సంరక్షణ ఆసుపత్రుల్లో 250, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 150, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 50, 24 గంటలూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 10, సాధారణ పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 5 సహజ ప్రసవాలను మైలురాయిగా వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. దాన్ని అధిగమించిన వైద్యసిబ్బందిలో డాక్టరుకు రూ.1000, మిడ్‌వైఫ్‌/స్టాఫ్‌నర్సు/ఏఎన్‌ఎంకు రూ.1000, ఆయా/పారిశుద్ధ్య సిబ్బందికి రూ.500, ఏఎన్‌ఎంకు రూ.250, ఆశా ఆరోగ్య కార్యకర్తకు రూ.250 చొప్పున మొత్తంగా రూ.3వేలను ఒక్కో కాన్పునకు చెల్లిస్తారు. ప్రతి ప్రసవ సమాచారాన్ని సంబంధిత ఆసుపత్రి ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు భద్రపరచాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని