Train Charges: డైనమిక్‌ ఛార్జీల పిడుగు

రాయితీ ప్రయాణాలను అనేక వర్గాలకు దూరం చేసిన రైల్వే శాఖ సాధారణ ప్రయాణాలపైనా భారం వేసి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. అనేక రైళ్లలో డైనమిక్‌ ఛార్జీల విధానాన్ని అమలుచేసేందుకు అధికారులు ప్రయత్నాలు

Updated : 06 Aug 2022 07:35 IST

డిమాండ్‌ ఉన్న ప్రధాన రైళ్లపై రైల్వే శాఖ దృష్టి
కసరత్తు మొదలుపెట్టిన అధికారులు
ప్రయాణికులపై భారీగా పెరగనున్న భారం

ఈనాడు, హైదరాబాద్‌: రాయితీ ప్రయాణాలను అనేక వర్గాలకు దూరం చేసిన రైల్వే శాఖ సాధారణ ప్రయాణాలపైనా భారం వేసి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. అనేక రైళ్లలో డైనమిక్‌ ఛార్జీల విధానాన్ని అమలుచేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మూడు రైళ్లలోనే ఈ విధానం అమల్లో ఉంది.

టికెట్ల ఆదాయం పెంపే లక్ష్యం

హైదరాబాద్‌ నుంచి దిల్లీ, విశాఖపట్నం, తిరుపతికి వెళ్లే రూట్లలో డిమాండ్‌ బాగా ఉంటుంది. ప్రయాణ తేదీకి చాలారోజుల ముందే రిజర్వేషన్లు అయిపోయే, నిరీక్షణ జాబితా వందల సంఖ్యలో ఉండే రైళ్లపై.. ద.మ.రైల్వే అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా ఏయే రైళ్లలో డైనమిక్‌ టికెట్‌ విధానాన్ని అమలు చేయాలన్న విషయంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రైలు బయల్దేరే సమయానికి కొద్ది గంటల ముందు ప్రయాణం పెట్టుకునే, అత్యవసరంగా ప్రయాణాలు చేసేవారి కోసమే ఈ విధానం అని రైల్వేశాఖ చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం టికెట్ల ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

భారీగా ఛార్జీల భారం

డైనమిక్‌ ఛార్జీలు ఉండే రైళ్లలో మొదటి 10 శాతం సీట్లకే సాధారణ ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు స్లీపర్‌లో 720 బెర్తులు ఉంటే 73వ బెర్తు నుంచి ఛార్జీలు పెరుగుతుంటాయి. అదనపు బాదుడును తప్పించుకోవాలంటే ఒకట్రెండు నెలల ముందే ప్రయాణ తేదీపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రయాణ తేదీకి ఎంత తక్కువ వ్యవధికి ముందు రిజర్వేషన్‌ తీసుకుంటే ఛార్జీల భారం అంత పెరుగుతుంది.

డైనమిక్‌లో మొదటి 10 శాతం టికెట్లకే బేస్‌ ప్రైస్‌ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 10 శాతం టికెట్లకు 10 శాతం చొప్పున ఛార్జీ పెరుగుతుంది. 11-20 శాతం టికెట్లపై అదనంగా 10 శాతం, 21-30 శాతం టికెట్లకు 20 శాతం, 31-40 శాతం టికెట్లకు 30 శాతం..41-50 శాతం టికెట్లకు అదనంగా 40% ఛార్జీల్ని భరించాలి. మిగిలిన 51-100 శాతం టికెట్లకు 50% ఛార్జీ అధికంగా ఉంటుంది. రిజర్వేషన్‌ ఛార్జీలు, కేటరింగ్‌ ఛార్జీల్లో మార్పు ఉండదు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లే దురంతో, రాజధాని రైళ్లలో, విశాఖపట్నం వెళ్లే దురంతోలో మాత్రమే ఈ విధానం అమలవుతోంది.

బాదుడు తేడా ఎంతెంతంటే?

రెగ్యులర్‌ రైళ్లతో పోలిస్తే.. రాజధాని, దురంతో వంటి డైనమిక్‌ ఛార్జీలు ఉండే రైళ్లలో ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆ ఛార్జీల తేడాలిలా..

దిల్లీలో తెలంగాణ, సంపర్క్‌క్రాంతి, దక్షిణ, హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సాధారణ ఛార్జీలు ఉంటే.. రాజధాని, దురంతోలో డైనమిక్‌ ఛార్జీలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు రోజుకు దాదాపు 10 రైళ్లు ఉంటే డైనమిక్‌ ఛార్జీల రైలు దురంతో ఒకటే ఉంది. ఈ రూట్లలో మిగతా రైళ్లలో, ఇతర రూట్లలో దశలవారీగా డజన్ల సంఖ్యలో ప్రధాన రూట్లలో డైనమిక్‌ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని