TS Inter Board: పెద్దలు చెబితే సరే

పలుకుబడి ఉంటే ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తరలించడానికి నిబంధనలు ఏమీ అడ్డు రావడం లేదు. పెద్దలు చెబితే చాలు కళాశాలలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించేందుకు అనుమతిస్తున్నారు.

Updated : 06 Aug 2022 05:17 IST

జూనియర్‌ కళాశాలల తరలింపులో నిబంధనలు బేఖాతరు
ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు 11 కళాశాలల మార్పునకు రంగం సిద్ధం
వివాదాస్పదంగా మారుతున్న ఇంటర్‌ బోర్డు నిర్ణయాలు

ఈనాడు, హైదరాబాద్‌: పలుకుబడి ఉంటే ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తరలించడానికి నిబంధనలు ఏమీ అడ్డు రావడం లేదు. పెద్దలు చెబితే చాలు కళాశాలలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించేందుకు అనుమతిస్తున్నారు. తాజాగా మరో 11 జూనియర్‌ కళాశాలల తరలింపునకు రంగం సిద్ధమైంది. ఇంటర్‌బోర్డు నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లడంతో ఏ క్షణానైనా వాటికి అనుమతి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఒకే మండల పరిధిలో మరో చోటకు తరలించాలంటే ఇంటర్‌బోర్డు అనుమతి ఇస్తుంది. దాన్ని లోకల్‌ షిఫ్టింగ్‌గా పిలుస్తారు. ఒక మండలం నుంచి మరో మండలానికి  లేదా మరో జిల్లాకు తరలించడాన్ని నాన్‌ లోకల్‌ షిఫ్టింగ్‌ అంటారు. ఇలా చేయవద్దని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలున్నాయి. అందుకే గత ఏడాది నాన్‌ లోకల్‌కు ఇంటర్‌బోర్డు దరఖాస్తులు స్వీకరించినా ప్రభుత్వం మాత్రం వాటి తరలింపునకు అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. మూడు నెలల క్రితం మాత్రం ఓ కళాశాలకు అనుమతి ఇస్తూ జీవో ఇచ్చింది. తాజాగా మరో 11 కళాశాలల నాన్‌ లోకల్‌ షిఫ్టింగ్‌కు అనుమతి కోరుతూ ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రభుత్వ స్థాయిలో ఆదేశాలు రావడంతోనే ఈ ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది.

మంత్రులు, ఎంపీల సిఫార్సులతోనే..

రాష్ట్ర ఆవిర్భావం నుంచి కొత్త కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదు. దాంతో ఆసక్తి ఉన్నవారు ఇప్పటికే ఉన్న కళాశాలలను కొనుగోలు చేసి నడుపుకుంటున్నారు. అంతేకాకుండా నాన్‌లోకల్‌ షిష్టింగ్‌కు కూడా గత ఏడాది నుంచి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఈసారి అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయంలో వాటికి అనుమతి లేదని బోర్డు పేర్కొంది. దరఖాస్తులు స్వీకరించలేదు. తాజాగా మొత్తం 11 కళాశాలలకు ముగ్గురు మంత్రులు,  ఇద్దరు ఎంపీలు, ప్రభుత్వ కార్యదర్శి, అదనపు కార్యదర్శి సిఫారసులతో తరలింపునకు వినతులు రావడంతో అందుకు అనుమతి కోరుతూ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. అందులో మూడు కళాశాలలు సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఒకవేళ అనుమతిస్తే అధికారికంగా అందరి నుంచీ దరఖాస్తులు స్వీకరించాలి. అందుకు విరుద్ధంగా పలుకుబడి ఉన్న కళాశాలల తరలింపునకు మాత్రమే అనుమతులు ఇస్తుండడం విమర్శలపాలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని