ఆరోగ్య సేవల్లో తెలంగాణది మూడో స్థానం

ఆరోగ్య సేవల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తల్లి పాల

Published : 06 Aug 2022 03:58 IST

తొలి గంటలో శిశువుకు అందే పాలు టీకాతో సమానం
పేట్లబుర్జు ఆసుపత్రిలో ‘తల్లి పాల బ్యాంకు’ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌; చార్మినార్‌, న్యూస్‌టుడే: ఆరోగ్య సేవల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానమన్నారు. తల్లి పాలకు నోచుకోని శిశువులకు ఈ బ్యాంకు ద్వారా ఉచితంగా పాలు అందించనున్నారన్నారు. మొదటి గంటలో శిశువుకు పాలు అందించడంతోపాటు ఆర్నెల్ల పాటు కొనసాగించడం వల్ల శిశు మరణాల రేటును 22 శాతం తగ్గించవచ్చనని సర్వేలు చెబుతున్నాయని వివరించారు.

పరీక్షలకు బయటికి పంపొద్దు..

అవసరమైన పరీక్షలు, స్కానింగ్‌లు ఆసుపత్రిలోనే చేయాలని, బయటకు పంపితే చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు. గాంధీని, నిమ్స్‌ దవాఖానాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చెరో 250 పడకల సూపర్‌స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఏవైనా క్రిటికల్‌ కేసులు వస్తే ప్రైవేటుకు కాకుండా...ప్రభుత్వ ఆసుపత్రికి పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతం పెంచాలన్నారు. ప్రతి నార్మల్‌ డెలివరీకి వైద్య సిబ్బందికి రూ.3 వేల వంతున పారితోషికం అందించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంతకుముందు సిజేరియన్‌ డెలివరీ చేస్తే రూ.11 వేలు ఇచ్చేవాళ్లమని, ఇది నెగెటివ్‌ ఇంక్రిమెంట్‌ కావడంతో దానిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు, బాలింతలతో హరీశ్‌రావు ప్రత్యేకంగా మాట్లాడి.. అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యశాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి, పేట్లబుర్జు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాలతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని