Telangana news: అప్పు పుట్టక.. ఆగిన ఇళ్ల నిర్మాణాలు

‘ఇల్లు కట్టి చూడు..’ సామెత ప్రజలకే కాదు ప్రభుత్వానికీ వర్తిస్తుంది.. అన్నట్లుగా మారింది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం. పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఈ ఇళ్ల నిర్మాణానికి నిధుల సమస్య తీవ్రంగా మారింది. చేసిన

Updated : 06 Aug 2022 05:20 IST

పేదల రెండు పడక గదుల ఇళ్లకు రూ.750 కోట్ల బిల్లులు పెండింగ్‌..
పూర్తి చేసేందుకు మరో   రూ.3,600 కోట్లు అవసరం
రూ.2 వేల కోట్ల హడ్కో రుణానికి   దిల్లీకి అధికారుల ప్రదక్షిణలు
రూ.వెయ్యి కోట్లయినా ఇవ్వాలని విన్నపాలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఇల్లు కట్టి చూడు..’ సామెత ప్రజలకే కాదు ప్రభుత్వానికీ వర్తిస్తుంది.. అన్నట్లుగా మారింది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం. పేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఈ ఇళ్ల నిర్మాణానికి నిధుల సమస్య తీవ్రంగా మారింది. చేసిన పనులకు బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండటంతో పలుచోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. లక్ష ఇళ్ల నిర్మాణం చివరిదశలో ఉండగా.. మరో లక్ష పైచిలుకు ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో దాదాపు 50 శాతం వరకు ఇళ్ల నిర్మాణం ఆగిపోయినట్లు సమాచారం. దీంతో అధికారులు గుత్తేదారులతో సమావేశాలు నిర్వహిస్తూ పనులు కొనసాగించాలని కోరుతున్నారు. హైదరాబాద్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణ పనులపై జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో గుత్తేదారులతో సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నాం.. రుణాల కోసమూ ప్రయత్నిస్తాం.. డబ్బులు వస్తాయి.. పనులు కొనసాగించాలి’ అని కోరినట్లు సమాచారం. ఇతర జిల్లాల్లోనూ అధికారులు కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నారు.

కొత్త అప్పు పుట్టడం కష్టమే!

గుత్తేదారులకు ఇప్పటికే రూ.750 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.3,600-3,800 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. హడ్కో నుంచి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే రూ.8,500 కోట్ల రుణం తీసుకుంది. మరో రూ.2 వేల కోట్ల రుణం కావాలని జనవరిలో కోరింది. అప్పటినుంచి అధికారులు దిల్లీలో హడ్కో ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్‌బీఐ అనుమతి కోసం లేఖ రాశామని, మే 23 కల్లా స్పష్టత వస్తుందని హడ్కో అధికారులు చెప్పి నెలలు దాటినా మంజూరు విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. రుణాల పరిమితిపై ఆర్‌బీఐ వైఖరి నేపథ్యంలో ఇతర సంస్థలు, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు రావడం కష్టమేనని భావిస్తున్న అధికారులు.. హడ్కోపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే అడిగినంత రుణం వచ్చే అవకాశం లేదని భావిస్తున్న రాష్ట్ర అధికారులు రూ.2 వేల కోట్లకు బదులు రూ.వెయ్యి కోట్లయినా ఇవ్వాలని తాజాగా విజ్ఞప్తి చేశారు.

ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టిన చోటే పనులు!

బిల్లుల చెల్లింపు ఆలస్యంతో గుత్తేదారులు అనేక చోట్ల పనులు ఆపారు. ఆర్థికంగా తట్టుకోగలిగిన గుత్తేదారులు మాత్రమే పనులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరచూ గుత్తేదారులతో మాట్లాడుతూ పనులు కొనసాగేలా చూస్తున్నారు. మిగిలినచోట్ల పనులు ఆగిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని