మూడేళ్లలో ఎన్‌హెచ్‌ఎం కింద రూ.2,361 కోట్ల విడుదల

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద తెలంగాణకు 2019-20లో రూ.964.34 కోట్లు, 2020-21 రూ.671.88 కోట్లు, 2021-22 రూ.725.67 కోట్లు కలిపి మొత్తం రూ.2,361.89 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌

Published : 06 Aug 2022 04:57 IST

ఈనాడు, దిల్లీ: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద తెలంగాణకు 2019-20లో రూ.964.34 కోట్లు, 2020-21 రూ.671.88 కోట్లు, 2021-22 రూ.725.67 కోట్లు కలిపి మొత్తం రూ.2,361.89 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. అలాగే క్షయ నిర్మూలన కోసం రూ.145.9 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు.

ఎన్‌జేఐఏఐపై ఏకాభిప్రాయం రాలేదు: కిరణ్‌రిజిజు

నేషనల్‌ జ్యుడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌జేఐఏఐ) ఏర్పాటుపై ఇటీవల జరిగిన రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో ఏకాభిప్రాయం రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. అందువల్ల ఆ ప్రతిపాదనను అంగీకరించలేదన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘‘కోర్టుల్లో అవసరమైన వసతుల కల్పన కోసం ఎన్‌జేఐఏఐ ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపి అభిప్రాయం కోరాం. ఆ అంశంపై ఏప్రిల్‌ 30న జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనూ చర్చజరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు’’అని రిజిజు తెలిపారు.

ఫ్రైట్ కారిడార్లను మంజూరు చేయలేదు.. సర్వే ప్రారంభం

రైల్వేశాఖ విజయవాడ మీదుగా సాగే రెండు ఫ్రైట్‌ కారిడార్లపై సర్వే, డీపీఆర్‌ తయారీ పనులు మొదలుపెట్టినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఖరగ్‌పుర్‌-విజయవాడ(1,115 కేఎం) మధ్య ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌, విజయవాడ-ఇటార్సీ(975 కిమీ) మధ్య ఉత్తర-దక్షిణ ఉపకారిడార్‌లపై ప్రస్తుతం సర్వే, డీపీఆర్‌ తయారీ పనులు సాగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ రెండు ఫ్రైట్‌ కారిడార్లనూ ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. కొత్త కారిడార్ల మంజూరు నిర్ణయం డీపీఆర్‌లో వెల్లడయ్యే వివరాలు, సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక సుస్థిరత, నిధుల ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు చెప్పారు.

మత్స్యసంపద యోజన కింద తెలంగాణలో 93,203 మందికి లబ్ధి

ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 2020-21, 2021-22లో తెలంగాణ నుంచి 93,203మందికి లబ్ధి చేకూరినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. ఎంపీ లక్ష్మణ్‌ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఈ రెండేళ్లలో తెలంగాణలో రూ.147.20 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి కేంద్ర వాటా కింద రూ.52.13 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ పథకం వల్ల చేపల ఉత్పత్తి 2019-20, 2021-22 సంవత్సరాల మధ్య 3లక్షల నుంచి 3.90 లక్షల టన్నులకు చేరినట్లు వెల్లడించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని