Telangana news: డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 282 మంది ఖైదీలు

వారంతా క్షణికావేశంలో నేరాలు చేసి ఖైదీలయ్యారు.. జైలు జీవితంలోనూ వారిలో చదువుకోవాలనే కాంక్ష ప్రబలంగా కలిగింది. అప్పటికే డిగ్రీ పూర్తి చేసి ఉంటే పీజీ, ఇంటర్‌ చదివి ఉంటే డిగ్రీ.. ఇలా తమకు

Updated : 07 Aug 2022 06:11 IST

ముగ్గురికి బంగారు పతకాలు
అంబేడ్కర్‌ వర్సిటీ స్నాతకోత్సవం
పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌; మాదాపూర్‌, న్యూస్‌టుడే: వారంతా క్షణికావేశంలో నేరాలు చేసి ఖైదీలయ్యారు.. జైలు జీవితంలోనూ వారిలో చదువుకోవాలనే కాంక్ష ప్రబలంగా కలిగింది. అప్పటికే డిగ్రీ పూర్తి చేసి ఉంటే పీజీ, ఇంటర్‌ చదివి ఉంటే డిగ్రీ.. ఇలా తమకు నచ్చిన కోర్సును ఎంచుకుని దూరవిద్యలో చదువుకున్నారు. వీరిలో ముగ్గురు ఏకంగా బంగారు పతకాలనే సాధించి ఔరా అనిపించారు. మరికొందరు ఎమ్మెస్సీని సైతం పూర్తి చేసి శెభాష్‌ అనిపించుకున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల జైళ్లలో ఖైదీలుగా ఉన్న వారిలో 282 మంది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం దూరవిద్యలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేశారు. వీరిలో 261 మంది పురుషులు కాగా.. మరో 21 మంది మహిళా ఖైదీలున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న షేక్‌ అజారుద్దీన్‌ డిగ్రీలో.. కడప కేంద్ర కారాగారంలో ఉన్న కె.సురేశ్‌రెడ్డి, ఎన్‌.రమేశ్‌బాబు పీజీలో బంగారు పతకాలు సాధించడం విశేషం. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ 24వ స్నాతకోత్సవం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరై.. చదువులో ఎదురయ్యే సవాళ్లను విద్యార్థులు ఎదుర్కొని ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయని ఉద్బోధించారు. ఈ సందర్భంగా కెనడాలోని కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ (సీవోఎల్‌) అధ్యక్షురాలు ప్రొ.ఆశాసింగ్‌ కన్వర్‌కు గవర్నర్‌, వర్సిటీ కులపతి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ అందించారు. ముఖ్యఅతిథి ప్రొ.ఆశాసింగ్‌ కన్వర్‌, వర్సిటీ ఉపకులపతి(వీసీ) ప్రొ.కె.సీతారామారావు ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 79,968 మంది విద్యార్థులకు పట్టాలు, 128 మందికి బంగారు పతకాలు అందిస్తున్నట్లు వీసీ చెప్పారు.


తల్లి చేతిలో బంగారు పతకమయ్యాడు

అమ్మకు చేదోడువాదోడుగా ఉంటూనే ఆ యువకుడు ఎమ్మెస్సీ పూర్తిచేసి బంగారు పతకం సాధించారు. దాన్ని అందుకునేలోగా గుండెపోటుతో 27 ఏళ్లకే ఈ లోకానికి దూరమయ్యారు. కుమారుడి స్థానంలో బంగారు పతకం అందుకుని కన్నీటిపర్యంతమయ్యారు ఆ తల్లి. అంబేడ్కర్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరుకు చెందిన తాళ్లపాక బాలసాయి సునీత్‌ అలోక్‌ (27) తల్లి నాగలక్ష్మి అంగన్‌వాడీ కార్యకర్త. తండ్రి లేకపోవడంతో కుమారుడిని ఆమే చదివించింది. డిగ్రీ అయ్యాక గ్రామవాలంటీర్‌గా పనిచేస్తూ.. కడపలోని అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య కేంద్రం నుంచి గతేడాది ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ పూర్తి చేశాడు. టాపర్‌గా నిలిచి బంగారు పతకం సాధించాడు. అతనికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ముందుగా గుర్తించలేదు. ఐదు నెలల కిందట నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడు. ‘‘అలోక్‌ చిన్నప్పటి నుంచి పది, ఇంటర్‌, డిగ్రీలో టాపర్‌గా నిలిచాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడతాడనుకున్న దశలో మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు’’ అంటూ నాగలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని