Projects: వరదలొచ్చినా.. ఉలుకు లేదు!

ప్రాజెక్టుల నిర్వహణపై నీటిపారుదలశాఖ శీతకన్ను ప్రదర్శిస్తోంది. ఇంజినీర్ల స్థాయి పోస్టులను మాత్రమే భర్తీ చేస్తూ క్షేత్రస్థాయిలో కీలకమైన సిబ్బంది నియామకాలపై దృష్టి సారించడం లేదు. గత నెలలో ప్రాజెక్టులకు భారీ వరద

Updated : 07 Aug 2022 04:02 IST

గేట్లు ఎత్తేందుకూ సిబ్బంది కరవు
ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఆపరేటర్ల పోస్టుల ఖాళీ
క్షేత్రస్థాయి ఉద్యోగుల నియామకంపై దృష్టి కరవు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాజెక్టుల నిర్వహణపై నీటిపారుదలశాఖ శీతకన్ను ప్రదర్శిస్తోంది. ఇంజినీర్ల స్థాయి పోస్టులను మాత్రమే భర్తీ చేస్తూ క్షేత్రస్థాయిలో కీలకమైన సిబ్బంది నియామకాలపై దృష్టి సారించడం లేదు. గత నెలలో ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తిన సమయంలో ఆనకట్టల వద్ద తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంజినీర్లే గేట్ల ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ల అవతారమెత్తాల్సి వచ్చింది. 5,200 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం కాగా.. 4,200కు పైగా పోస్టులు ఖాళీగా ఉండటం దీనికి కారణం.

రెండేళ్ల క్రితమే నివేదించినా..

నీటిపారుదల శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను రెండేళ్ల క్రితమే గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. గ్రామ రెవెన్యూ సహాయకులను(వీఆర్‌ఏ) లస్కర్లు, తత్సమానమైన పోస్టుల్లో తీసుకోవాలని భావించినా ముందడుగు పడలేదు.  ఆనకట్టల నిర్వహణకు ప్రధానంగా దిగువ కేడర్‌ సిబ్బంది అవసరాన్ని ఇటీవల వరదలు చాటిచెప్పాయి. కడెం, వట్టివాగు, కుమురం భీం ప్రాజెక్టుల వద్ద వరదలొచ్చిన సమయంలో పట్టుమని 20 మంది కూడా క్షేత్రస్థాయి సిబ్బంది లేక ఇంజినీర్లు అవస్థలు పడ్డారు. ప్రాజెక్టుల వద్ద పరిస్థితి, చెరువు కట్టల తీరుపై ప్రభుత్వానికి సమాచారం అందించేందుకు ఎవరూ లేరు. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టు కింద తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న లస్కర్లు ఉన్నారు. రెగ్యులర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని