సంక్షిప్త వార్తలు (9)

ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వోలకు మనోధైర్యం కల్పించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు ఆదివారం హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి

Updated : 07 Aug 2022 05:55 IST

నేడు రెవెన్యూ ఉద్యోగుల భావి కార్యాచరణ సభ  

ఈనాడు, హైదరాబాద్‌: ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వోలకు మనోధైర్యం కల్పించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు ఆదివారం హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భాజపా నుంచి ఈటల, బీఎస్పీ నుంచి ప్రవీణ్‌కుమార్‌, తెజస నుంచి కోదండరాం, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఆప్‌ పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపారు.


డయాలసిస్‌ రోగులకు పింఛనుపై హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డయాలసిస్‌ రోగులకు సీఎం కేసీఆర్‌ రూ.2,016 పింఛను ప్రకటించడంపై తెలంగాణ బోధన ఆసుపత్రుల ప్రభుత్వ వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కిరణ్‌ మాదల, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జలగం తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌కు కృతజ్ఞత తెలిపారు. కనీసం 10,500 మందికి లబ్ధిచేకూరనుందని వెల్లడించారు.


వినియోగదారుల కమిషన్లకు జ్యుడిషియల్‌ అధికారాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌, జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యులకు ‘మొదటి తరగతి జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌’ అధికారాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 72(2) కింద.. కమిషన్‌ సభ్యులకు ఈ అధికారాలు వర్తిస్తాయని ఎక్స్‌అఫిషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ జీవోలో పేర్కొన్నారు.


వీఆర్వోల బదిలీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం
ఆ విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది: వీఆర్వో ఐకాస

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ ఉద్యోగుల(వీఆర్వోల)ను రాజ్యాగ నిబంధనలకు, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారని వీఆర్వో ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌, ఉపాధ్యక్షుడు జె.రవి నాయక్‌, అదనపు కార్యదర్శి పల్లెపాటి నరేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీలపై తాము హైకోర్టును ఆశ్రయించగా  ప్రక్రియను బలవంతంగా చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. రెవెన్యూశాఖలో ఖాళీలు ఉండగా అదనపు సిబ్బందిగా వీఆర్వోలను ఎలా గుర్తిస్తారని, ఉద్యోగ/సర్వీస్‌ భద్రత, సీనియారిటీ, పదోన్నతుల పరిరక్షణ లేకుండా బదిలీ చేయడం తప్పని వారు పేర్కొన్నారు.


మైనార్టీ విద్యార్థుల కేంద్ర ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌, మెరిట్‌ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటి నుంచి 10 వరకు చదువుతున్న ప్రీమెట్రిక్‌ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా, ఇంటర్‌ ఆ పైన చదివే పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు  https://scholarships.gov.in పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు చేసుకునేముందు అర్హతలు పరిశీలించుకోవాలంది.


స్వాతంత్య్ర కవాతుకు గిరిజన గురుకుల విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో పాల్గొనేందుకు తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. మరిపెడ, మణుగూరు, కొత్తగూడెం గురుకులాలకు చెందిన డి.త్రివేణి, నంద కేశవ్‌, నవీన్‌, విష్ణు పరేడ్‌లో పాల్గొననున్నారు. ఖమ్మం ఎన్‌సీసీ క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో త్రివేణి, నందకేశవ్‌ ఎంపికవగా, కాకినాడలో నిర్వహించిన ఏక్‌భారత్‌ శ్రేష్ఠభారత్‌ కార్యక్రమంలో బి.నవీన్‌, బి.విష్ణు ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు.


స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో కలసి ఆయన అన్ని శాఖల ఉన్నతాధికారులతో శనివారం బీఆర్‌కే భవన్‌లో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడారు. ‘‘8న హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో వజ్రోత్సవాలను సీఎం ప్రారంభిస్తారు. 9 నుంచి 21వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో వజ్రోత్సవాలు జరుగుతాయి. వీటిలో ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థుల కోసం రాష్ట్రంలోని దాదాపు 563 సినిమా హాళ్లలో ‘గాంధీ’ చలనచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ సినిమాను సుమారు 35 లక్షల మంది ఉచితంగా వీక్షించనున్నారు. 15న గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ జెండాను ఎగురవేస్తారు’’ అని సీఎస్‌ వివరించారు.


అగ్రి ఉడాన్‌ అయిదో దశ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ(నార్మ్‌)లో అంకుర సంస్థలను మరింతగా ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘అగ్రి ఉడాన్‌’ కార్యక్రమం అయిదో దశను శనివారం ప్రారంభించినట్లు సంస్థ సంచాలకుడు సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. అంకుర సంస్థల ఏర్పాటు, నిర్వహణ, వాణిజ్యం అభివృద్ధి వరకూ పర్యవేక్షించేందుకు ఈ సంస్థలో ‘ఎ-ఐడియా’ టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌ కేంద్రం పనిచేస్తోందన్నారు. ఆహార, వ్యవసాయ వాణిజ్యంలో కొత్త ఆలోచనలతో వచ్చే వారికి ఈ కేంద్రం సహకరిస్తుందన్నారు. అగ్రి ఉడాన్‌-5 ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన పలువురు వక్తలు అంకుర సంస్థల అభివృద్ధిపై సూచనలు చేశారు.


భీమిలి వైకాపా ఎంపీపీ ఇళ్లలో ఐటీ సోదాలు

విశాఖపట్నం (గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లా భీమిలి వైకాపా మండల పరిషత్తు అధ్యక్షుడు డి.వాసురాజు ఇళ్లలో ఆదాయపన్ను విభాగం సోదాలు చేసిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. భీమిలి మండలం అమనాంలో, విశాఖ నగరంలోని ఇళ్లలో, మద్దిలపాలెంలోని ఆయన స్థిరాస్తి వ్యాపార సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. నాలుగు రోజులుగా సోదాలు సాగుతున్నాయని, ముఖ్యమైన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు తనిఖీ చేశారు. కొద్దిరోజుల కిందట వాసురాజుకు, నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఐటీ సోదాల అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని