జైళ్లలో ‘మృత్యుఘోష’

చర్లపల్లి కేంద్ర కారాగారం రాష్ట్రంలోనే అత్యధికంగా 2331 మంది ఖైదీలున్నా వారు అనారోగ్యానికి గురైతే పర్యవేక్షించాల్సిన వైద్యులు తగినంతమందిలేరు. ఇక్కడ గల నాలుగు పోస్టులకుగాను సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌తోపాటు సైకియాట్రిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది.

Updated : 07 Aug 2022 05:52 IST

అయిదేళ్లలో 38 మంది ఖైదీలు గుండెపోటుతో మృతి
మరో 34 మంది ఇతర జబ్బులతో..

చర్లపల్లి కేంద్ర కారాగారం రాష్ట్రంలోనే అత్యధికంగా 2331 మంది ఖైదీలున్నా వారు అనారోగ్యానికి గురైతే పర్యవేక్షించాల్సిన వైద్యులు తగినంతమందిలేరు. ఇక్కడ గల నాలుగు పోస్టులకుగాను సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌తోపాటు సైకియాట్రిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది. రాష్ట్రంలో అధికశాతం జైళ్లదీ ఇదే పరిస్థితి. కారాగారాల్లోని వైద్యాధికారుల్ని ఇటీవలే కొత్తగా ఏర్పాటైన వైద్యకళాశాలలకు బదిలీ చేయడంతో ఈ సమస్య తలెత్తింది.

రాష్ట్రంలో గడచిన అయిదేళ్లలో 72 మంది ఖైదీలు అనారోగ్య కారణాలతో మృతిచెందారు. వీరిలో 38 మందివి గుండెపోటు మరణాలే కావడం గమనార్హం. గుండెపోటు సమయంలో అత్యవసర వైద్యం అవశ్యం. కానీ జైళ్లలో వైద్యాధికారుల కొరత ఖైదీల ప్రాణాల ప్రాణాలమీదకు తెస్తోంది.

జైళ్లశాఖలో 22 మెడికల్‌ ఆఫీసర్‌(సివిల్‌ అసిస్టెంట సర్జన్‌), 14 ఫార్మాసిస్ట్‌, 4 ల్యాబ్‌టెక్నీషియన్‌ చొప్పున 40 పోస్టులుండగా..వీటిలో 16 ఖాళీలున్నాయి. ముఖ్యంగా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులతోపాటు సైకియాట్రిస్ట్‌ పోస్టుల్లో కొరత ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చర్లపల్లి, చంచల్‌గూడలాంటి కేంద్ర కారాగారాల్లో నిత్యం వంద వరకు ఓపీ ఉంటుంది. అలాగే 30-40వరకు కొత్త ఖైదీల్ని స్క్రీనింగ్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రివిధుల్లో వైద్యాధికారులు లేక కాస్తంత వైద్యపరిజ్ఞానం ఉన్న జైలు సిబ్బందికే బాధ్యతలు అప్పగిస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కనీసం చర్లపల్లి, చంచల్‌గూడ, నిజామాబాద్‌ జైళ్లకైనా తగినంతగా వైద్యాధికారుల్ని కేటాయించాలని కొద్దిరోజుల క్రితం జైళ్లశాఖ చేసిన ప్రతిపాదన బుట్టదాఖలైంది.

గడచిన అయిదేళ్లలో జైళ్లలో సంభవించిన 38 గుండెపోటు మరణాలు పోను మిగిలినవారిలో అయిదుగురు కాలేయం, ఒకరు కిడ్నీ, ఇంకొకరు ఊపిరితిత్తులు చెడిపోవడంతో, ఇంకొకరు మూర్ఛరోగంతో తనువు చాలించారు. బ్రెయిన్‌ హ్యామరేజ్‌ 1, మద్యం లేదా మాదకద్రవ్యాల ఉపసంహరణ 1, హెచ్‌ఐవీతో ఒకరు, టీబీతో అయిదుగురు, క్యాన్సర్‌తో నలుగురు, ఇతర కారణాలతో 14 మంది మరణించారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని