కొత్త బస్సుల కొనుగోలుకు అప్పుల తిప్పలు

ఆర్టీసీలో బస్సుల కొనుగోలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వం చొరవ చూపనిదే ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాలం చెల్లిన బస్సులతో అవస్థలు పడుతున్న ఆర్టీసీ కొత్తవి కొనాలని నిర్ణయించింది.

Published : 07 Aug 2022 05:25 IST

రుణం ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్న బ్యాంకులు
కేంద్ర ఆంక్షలు, ఆర్బీఐ ఆదేశాలే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీలో బస్సుల కొనుగోలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వం చొరవ చూపనిదే ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాలం చెల్లిన బస్సులతో అవస్థలు పడుతున్న ఆర్టీసీ కొత్తవి కొనాలని నిర్ణయించింది. అవసరమయ్యే రూ.400 కోట్లను బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని భావించింది. రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వాటి ఖరారుకు రంగం సిద్ధమైంది. ఆ చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ముందస్తుగానే రుణాల కోసం బ్యాంకులతో మౌఖికంగా నిర్వహించిన సంప్రదింపుల్లో సూత్రప్రాయ సుముఖత వ్యక్తం అయింది. అయితే కేంద్రం నిర్ణయించిన ఎఫ్‌ఆర్బీఎం నిబంధనలు ఆర్టీసీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. వివిధ కార్పొరేషన్లు తీసుకునే అప్పుల్ని కూడా రాష్ట్రప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని కేంద్రం స్పష్టం చేయడం ఇందులో ముఖ్యాంశం. ఈ క్రమంలోనే కార్పొరేషన్లకు ఇచ్చే రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రిజర్వు బ్యాంకు ఆదేశించటంతో బ్యాంకులు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

రెండు మూడు బ్యాంకులను సంప్రదించినా...

మొత్తం 1,016 బస్సులు కొనేందుకు బ్యాంకుల నుంచి సుమారు రూ.400 కోట్లు రుణాలు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్బీఐ నుంచి ఆదేశాలు రావటానికి ముందు వరకు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిన బ్యాంకులు ఆ తరవాత నుంచి ముఖం చాటేస్తున్నట్లు సమాచారం. రెండు మూడు బ్యాంకులను సంప్రదించినప్పటికీ అదే పరిస్థితి ఎదురుకావటంతో అధికారులు అయోమయంలో పడ్డారు.

ప్రభుత్వ చేయూత ఒక్కటే మార్గం

ఆర్టీసీలో సుమారు ఆరున్నర వేలకుపైగా బస్సులుంటే అందులో 2,800 వరకు కాలం చెల్లినవే. వాటిని అనివార్యంగా మార్చాలి. బ్యాంకుల నుంచి రుణాలు లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం చేయూత ఇవ్వటం ఒక్కటే మార్గం. ఆర్థిక సహాయం రూపంలో చెల్లిస్తే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీకి కొంత ఉపశమనంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని