మన్ననూరులో మట్టి ఇళ్లు

మహారాష్ట్రలోని తడోబా, రాజస్థాన్‌లోని రణతంబోర్‌ తరహాలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుకు పర్యాటకుల్ని పెద్దసంఖ్యలో ఆకర్షించడంపై అటవీశాఖ దృష్టి సారించింది. నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులు బస చేసేలా వసతి ఏర్పాట్లు,

Published : 07 Aug 2022 05:25 IST

టైగర్‌ సఫారీ పర్యాటకులకు కొత్త వాహనాలు?
నల్లమల అడవుల్లో పర్యాటకం పెంపుపై అటవీశాఖ యోచన

ఈనాడు, హైదరాబాద్‌: మహారాష్ట్రలోని తడోబా, రాజస్థాన్‌లోని రణతంబోర్‌ తరహాలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుకు పర్యాటకుల్ని పెద్దసంఖ్యలో ఆకర్షించడంపై అటవీశాఖ దృష్టి సారించింది. నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులు బస చేసేలా వసతి ఏర్పాట్లు, పులుల సఫారీలో తిరిగేందుకు తగినన్ని సరికొత్త వాహనాల్ని సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది.

పెరుగుతున్న పర్యాటకులు

నల్లమల అటవీ ప్రాంతానికి వచ్చే ప్రకృతి పర్యాటకుల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది. టైగర్‌ రిజర్వులో తిరిగేందుకు రెండే సఫారీ వాహనాలున్నాయి. దీంతో ముందే బుక్‌ చేసుకున్నవారికి తప్ప నేరుగా వచ్చేవారికి వాహనాల్ని సమకూర్చలేకపోతున్నారు. సమస్య పరిష్కారానికి ఐదారు సఫారీ వాహనాల కొనుగోలుకు అనుమతివ్వాలని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు అధికారుల నుంచి ప్రధాన అటవీ సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్‌)కి ప్రతిపాదనలు అందాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే వాహనాల్ని కొనుగోలు చేయాలని అటవీశాఖ భావిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలనూ పరిశీలిస్తున్నారు.

మోడల్‌ గృహాల నిర్మాణం

పర్యాటకుల వసతి కోసం మన్ననూరులో అటవీశాఖ కాటేజీ(వనమాలిక)లు ఆరే ఉన్నాయి. వాటిలో 12 మందికే వసతి సరిపోతుంది. ఈ క్రమంలో అదనపు వసతి ఏర్పాట్ల కోసం మట్టి గృహాలు నిర్మించాలని అటవీశాఖ నిర్ణయించింది. శాఖ పరంగా ఓ నమూనాను ఏర్పాటు చేసి ఆ తర్వాత స్థానికులతో సొంతంగా కాటేజీలు, హోం స్టే వంటివి ఏర్పాటు చేయించాలన్నది యోచన. ఇటీవల ఓ ప్రైవేటు వ్యక్తి కాటేజీలు ఏర్పాటు చేశాడని, ఈ తరహా స్థానికుల నుంచి మరిన్ని రావాలన్నదే లక్ష్యమని అటవీశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తమ ఇళ్లనే స్థానికులు వసతిగృహాలుగా మార్చడంతో పాటు అటవీశాఖతో కలిసి అటవీ అందాలు చూపించడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చని అధికారులు చెబుతున్నారు.


స్థానికులకు ఉపాధి పెరుగుతుంది

- రోహిత్‌ గొప్పిడి, ఎఫ్‌డీఓ-అమ్రాబాద్‌

నల్లమలలో ప్రకృతి పర్యాటకాన్ని పెంచడంపై దృష్టి పెట్టాం. పచ్చటి పల్లెటూరిలో ఉన్నామన్న ప్రత్యేక అనుభూతి కలిగించేందుకు మట్టి గృహా(మడ్‌ హౌస్‌)ల్లో బస చేసేలా, వీటిని నిర్మించే ఆలోచన ఉంది. అమ్రాబాద్‌లో ప్రకృతి పర్యాటకాన్ని పెంచితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వారికి ఉండే ఖాళీ భూమిని పర్యాటకులకు వసతి తదితర ఏర్పాట్లకు ఉపయోగించడం ద్వారా వారికి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని