KTR: ‘నేతన్నకు బీమా’ దేశానికి ఆదర్శం

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పరిశ్రమలు, ఐటీ, చేనేత శాఖల మంత్రి కేటీ రామారావు భరోసా ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ కానుకగా నేతన్నల కోసం బీమా పథకాన్ని ఆయన

Updated : 08 Aug 2022 06:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పరిశ్రమలు, ఐటీ, చేనేత శాఖల మంత్రి కేటీ రామారావు భరోసా ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ కానుకగా నేతన్నల కోసం బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అభివర్ణించారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. పథకం రూపేణా 80వేల కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే నామినీకి పది రోజుల్లోనే రూ.5లక్షల బీమా అందుతుందని కేటీఆర్‌ తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకురావాలని సూచించారు. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి దృశ్యమాధ్యమంలో ప్రసంగించారు. ‘‘స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గాంధీజీ చరఖాను నమూనాగా తీసుకొని.. నూలు వడుకుతూ జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారు. కానీ, కేంద్రం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల వేళ చేనేతను నిర్వీర్యం చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ధోరణి మారాలి. తెలంగాణ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రతి సోమవారం ఉద్యోగులు నేత వస్త్రాలను ధరించాలి’’ అని కేటీఆర్‌ కోరారు. మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్సీ ఎల్‌.రమణ,  వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఆప్కో మాజీ ఛైర్మన్‌ మండల శ్రీరాములు, చేనేత కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట 28 మంది చేనేత కళాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతిభా పత్రంతోపాటు రూ.25వేల చొప్పున నగదు అందజేశారు. ఈ పథకానికి ప్రీమియం కింద రూ.50 కోట్ల చెక్కును ఎల్‌ఐసీ అధికారులకు అందజేశారు.

జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

వారంపాటు జరగనున్న జాతీయ స్థాయి చేనేత ప్రదర్శనను మంత్రి కేటీఆర్‌ దృశ్యమాధ్యమంలో ప్రారంభించారు. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులు, సహకార సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని