ఆసరా అర్హుల్లో.. ఆశల చిగురింతలు

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఆసరా పింఛను దరఖాస్తుదారుల్లో ఆశలు నెలకొన్నాయి. 65 ఏళ్ల వయసు దాటిన, భర్తను కోల్పోయి వితంతువులైన, ఇతర కేటగిరీలకు

Published : 08 Aug 2022 04:38 IST

మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న  3.3 లక్షల మంది
57 ఏళ్లు దాటిన వారి దరఖాస్తులు 7.8 లక్షలు
లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేయనున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఆసరా పింఛను దరఖాస్తుదారుల్లో ఆశలు నెలకొన్నాయి. 65 ఏళ్ల వయసు దాటిన, భర్తను కోల్పోయి వితంతువులైన, ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 3.3 లక్షల మంది మూడున్నరేళ్లుగా పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. వీరి దరఖాస్తులు ఇప్పటికే మండల, పంచాయతీ కార్యాలయాల్లో పరిష్కారమయ్యాయి. అవన్నీ రాష్ట్రస్థాయి లాగిన్‌లో నిలిచిపోయాయి. హుజూరాబాద్‌, దుబ్బాక, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించిన ప్రభుత్వం మిగతా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ లాగిన్‌లోని దరఖాస్తులను ఆమోదిస్తే వెంటనే 3.3 లక్షల మందికి పింఛను అందేందుకు వీలుంటుందని గ్రామీణాభివృద్ధిశాఖ వర్గాలు వెల్లడించాయి.

అలాగే వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తగ్గించింది. అదే నెలలో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ విభాగంలో దాదాపు 7.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు. సీఎం కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా త్వరలోనే ఆయా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు. అర్హులను గుర్తించి లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38.41 లక్షల మంది వివిధ రకాల ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016, ఇతర కేటగిరీల వారికి నెలకు రూ.2,016 అందుతోంది. ఈ పింఛన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.11,728 కోట్ల నిధులను కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని