జైళ్ల పునర్‌ వ్యవస్థీకరణ!

జైళ్లశాఖలో సుదీర్ఘకాలం తర్వాత పునర్‌వ్యవస్థీకరణ చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలో సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా జైళ్లను కేంద్ర కారాగారాలుగా మార్చడంతోపాటు సిద్దిపేటలో కొత్తగా జిల్లా జైలు, వరంగల్‌ మామునూరులో కొత్త

Published : 08 Aug 2022 04:38 IST

కేంద్ర కారాగారాలుగా నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లా జైళ్లు
సిద్దిపేటలో కొత్తగా జిల్లా జైలు..
వరంగల్‌లో ఓపెన్‌ఎయిర్‌ కారాగారం
రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం..

ఈనాడు, హైదరాబాద్‌: జైళ్లశాఖలో సుదీర్ఘకాలం తర్వాత పునర్‌వ్యవస్థీకరణ చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలో సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా జైళ్లను కేంద్ర కారాగారాలుగా మార్చడంతోపాటు సిద్దిపేటలో కొత్తగా జిల్లా జైలు, వరంగల్‌ మామునూరులో కొత్త ఓపెన్‌ఎయిర్‌ జైలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలిసింది.  

రాష్ట్రంలో ప్రస్తుతం చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌లో కేంద్ర కారాగారాలున్నాయి. వరంగల్‌ నగరంలోని కేంద్ర కారాగారాన్ని శివారులోని మామునూరుకు తరలించేందుకు ఏడాది క్రితం మూసేశారు. అక్కడి ఖైదీలను చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు తరలించారు. రెండేళ్లలోపు శిక్ష పడిన ఖైదీలను జిల్లా జైళ్లలో, అంతకంటే ఎక్కువ శిక్ష ఖరారైన వారిని కేంద్ర కారాగారంలో ఉంచుతారు. ఈ క్రమంలో చర్లపల్లి, చంచల్‌గూడ కేంద్ర కారాగారాల్లో ఖైదీల సంఖ్య ఎక్కువై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా జైళ్లను కేంద్ర కారాగారాలుగా మార్చాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా జైలు 40 ఎకరాల విస్తీర్ణంలో 260 మంది ఖైదీల సామర్థ్యంతో ఉంది. నిజామాబాద్‌ జైలుని 320 మంది ఖైదీల సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 8 బరాక్‌లున్నాయి. హైరిస్క్‌ ఖైదీలను ఉంచేందుకు సెక్యూరిటీ బరాక్‌తోపాటు మహిళా ఖైదీల కోసం ఓ వార్డు అందుబాటులో ఉంది.  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేట కీలక ప్రాంతం. అయితే జిల్లా జైలు సంగారెడ్డిలో ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఖైదీలందరినీ సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించాల్సిన పరిస్థితి. మెదక్‌ నుంచి కొత్త జిల్లాగా ఏర్పాటైన సిద్దిపేటలో ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల నుంచి హుస్నాబాద్‌, కొమురవెల్లి వంటి ప్రాంతాలు కలిశాయి. ఇవి సంగారెడ్డి జిల్లా జైలుకు ఇంకా దూరంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో కొత్తగా జిల్లా జైలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీని నిర్మాణానికి సుమారు రూ.90 కోట్లు వెచ్చించే యోచనతో ఉన్నారు. 56 పోస్టులను సైతం మంజూరు చేయనున్నారు.

రెండో ఓపెన్‌ఎయిర్‌ జైలు..

వరంగల్‌ శివారు మామునూరులో కేంద్ర కారాగారం నిర్మాణానికి పోలీస్‌ బెటాలియన్‌ పరిధిలో జైళ్లశాఖకు 101 ఎకరాలు కేటాయించారు. తాజాగా ఇక్కడ ఓపెన్‌ ఎయిర్‌ జైలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని