విద్యార్థులు అడిగేవి కనీస వసతులే

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవమేనని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వసతులను పరిశీలించిన తర్వాత

Published : 08 Aug 2022 04:38 IST

వాటిని ఎప్పుడో పరిష్కరించి ఉండాల్సింది
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా
బాసరలో గవర్నర్‌ తమిళిసై
ఆర్జీయూకేటీ, తెలంగాణ వర్సిటీల సందర్శన

ఈటీవీ, ఆదిలాబాద్‌; ఈనాడు, నిజామాబాద్‌: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవమేనని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వసతులను పరిశీలించిన తర్వాత విద్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దాదాపు 8,500 మంది విద్యార్థులున్న ఆర్జీయూకేటీలో 2017 నుంచి ల్యాప్‌టాప్‌ల సరఫరా ఆగిపోయినట్లు తేలిందని తెలిపారు. విద్యార్థులతో సామూహికంగా, వ్యక్తిగతంగానూ మాట్లాడానని వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా నిర్వాహకులు మంచి అల్పాహారం వడ్డించినందున విద్యార్థులు తనను రోజూ రావాలని కోరినట్లు చెప్పారు. ఇంకా గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘‘విద్యాలయంలో బోధకులు, సిబ్బంది కొరత ఉంది. పౌష్టికాహారం అందడం లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగాలేవు. విద్యార్థుల ఇబ్బందులన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అవన్నీ కనీస మౌలిక వసతులే. వాటిని ఎప్పుడో పరిష్కరించి ఉండాల్సింది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్రీడలో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు సరైన వసతులు అందుబాటులో లేవు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వరంగల్‌ జిల్లా విద్యార్థి కుటుంబానికి సాయం అందేలా నా వంతు కృషి చేస్తా. క్యాంపస్‌లో విద్యార్థులపై పోలీసుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు నా దృష్టికి రాగా ఇన్‌ఛార్జి వీసీతోనూ చర్చించాను. విద్యార్థులంతా పరిణతి కలిగి ఉన్నారు. వారికి భవిష్యత్తుపై దృష్టిసారించి పట్టుదలతో చదువుకోవాలని అమ్మలా హితవు చెప్పా. విద్యాలయంలో నెలకొన్న సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయి’’ అని పేర్కొన్నారు. తనకు అధికారిక ప్రొటోకాల్‌ అంశంపై కాస్తంత ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్‌.. తన విషయంలో ఏం జరుగుతోందనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనన్నారు.  

విద్యార్థులతో అనుబంధాన్ని పెంచుకుంటున్నా

విద్యార్థులతో అనుబంధాన్ని పెంచుకొనే దిశగా ప్రయత్నిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. ఇందుకోసం ‘కనెక్ట్‌ ఛాన్సలర్‌ అల్యూమిని’ అనే విభాగం ద్వారా వారికి చేరువవుతున్నట్లు వివరించారు. ఆదివారం బాసర ఆర్టీయూకేటీని సందర్శించిన ఆమె, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఉపకులపతి ఆచార్య రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌తో పాటు పాలకమండలి సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల భవనంలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులతో ఆమె మాట్లాడారు. వర్సిటీ అనుబంధ ప్రాంగణాల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులు గవర్నర్‌కు వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఒత్తిడి తెస్తానన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా గవర్నర్‌ పర్యటనలో కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ పాల్గొనలేదు.సెలవులో ఉన్నారని అధికార వర్గాలు చెప్పాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని