ఆయిల్‌పాం ధరలు పతనం

ఆయిల్‌పాం పంట ధరలు పతనమవుతున్నాయి. గత మే నెలలో ఈ పండ్లగెలల టన్ను గరిష్ఠ ధర రూ. 23,400 ఉండగా ఈ నెలలో రూ.16,800 ఇవ్వాలని రాష్ట్ర ఉద్యానశాఖ తాజాగా నిర్ణయించింది.  గత పక్షం రోజులుగా

Published : 08 Aug 2022 05:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆయిల్‌పాం పంట ధరలు పతనమవుతున్నాయి. గత మే నెలలో ఈ పండ్లగెలల టన్ను గరిష్ఠ ధర రూ. 23,400 ఉండగా ఈ నెలలో రూ.16,800 ఇవ్వాలని రాష్ట్ర ఉద్యానశాఖ తాజాగా నిర్ణయించింది.  గత పక్షం రోజులుగా పామాయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య(ఆయిల్‌ఫెడ్‌) తాజాగా రైతు బజార్లలో దీని ధరను లీటరు రూ.126గా నిర్ణయించింది.  మూడు నెలల క్రితం ఇది గరిష్ఠంగా రూ.167కి చేరింది. రష్యా నుంచి పొద్దుతిరుగుడు, ఇండోనేసియా నుంచి పామాయిల్‌ ఎగుమతులు పెరగడంతో మనదేశంలో వంటనూనెల ధరలు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో ఆయిల్‌పాం పండ్లగెలలు సాధారణంగా జూన్‌ నుంచి అక్టోబరు దాకా నూనె మిల్లులకు వస్తాయి. ఆయిల్‌ఫెడ్‌కు ఉన్న మిల్లులు.. గెలలను గానుగాడితే వచ్చే పామాయిల్‌ శాతం(రికవరీ) ఆధారంగా ఆయిల్‌పాం ధరలను నిర్ణయిస్తారు.  

రూ.12 వేలు వస్తేనే...

రాష్ట్రంలో ఈ పంట సాగు ఖర్చులన్నీ లెక్కిస్తే టన్నుకు కనీసం రూ.12 వేలు వస్తేనే రైతులకు ఎంతోకొంత మిగులుతుందని ఆయిల్‌ఫెడ్‌ అధ్యయనంలో గుర్తించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అక్కడి నుంచి వచ్చే పొద్దుతిరుగుడు దిగుమతులు తగ్గడం, ఇండోనేసియా పామాయిల్‌ ఎగుమతులపై ఆంక్షలు పెట్టడం వల్ల గత ఏడాది నుంచి వంటనూనెల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు తగ్గుతున్నందున మనదేశంలోకి దిగుమతులు పెరిగాయి. మున్ముందు పామాయిల్‌ ధర రూ.120 లోపునకు వస్తుందని, ఆయిల్‌పాం పంట ధర కూడా టన్నుకు రూ.15 వేలకు పడిపోతుందని అంచనా. ప్రస్తుతం 45 వేల ఎకరాల్లోనే ఈ పంట ఉంది. రాష్ట్రంలో మరో 2 లక్షల ఎకరాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని