ఆలోచనతో రండి.. అంకురంగా ఎదగండి

ఒక అంకుర సంస్థ ఏర్పాటు చేయాలంటే.. ఎంతో ప్రహసనంతో కూడుకున్న ప్రక్రియ. ఆలోచన మొదలుకొని డిజైన్‌, నమూనా తయారీ, పనితీరు, నిధుల సమీకరణ.. ఇలా ఎన్నో దశలు దాటుకుని రావాలి. ఈ పరిస్థితుల్లో అంకుర సంస్థలు ఏర్పాటు

Updated : 08 Aug 2022 06:09 IST

విద్యార్థులు, ఆచార్యులకు ఉచితంగా స్థలం, పరికరాలు ఇవ్వాలని హెచ్‌సీయూ నిర్ణయం
ఈనాడు - హైదరాబాద్‌

క అంకుర సంస్థ ఏర్పాటు చేయాలంటే.. ఎంతో ప్రహసనంతో కూడుకున్న ప్రక్రియ. ఆలోచన మొదలుకొని డిజైన్‌, నమూనా తయారీ, పనితీరు, నిధుల సమీకరణ.. ఇలా ఎన్నో దశలు దాటుకుని రావాలి. ఈ పరిస్థితుల్లో అంకుర సంస్థలు ఏర్పాటు చేయాలనుకునే వారికి నిధులు, వనరులు ఎంతో అవసరం. ఈ ఇబ్బందులు అధిగమించలేక ఆలోచన ఉన్నా.. ఆచరణలోకి తీసుకెళ్లలేరు. అలాంటి విద్యార్థులు, ఆచార్యులకు అండగా నిలవాలని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
హెచ్‌సీయూలో అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు అస్పైర్‌ అనే లాభాపేక్ష లేని (సెక్షన్‌-8) కంపెనీ నిర్వహిస్తున్నారు. దీని కింద బయోనెస్ట్‌, టైడ్‌, టీబీఐ ఇంక్యుబేషన్‌ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వివిధ రంగాల్లోని ఔత్సాహిక యువతకు, ఆయా కేంద్రాల్లో అంకుర సంస్థలకు నిర్దేశిత రుసుములతో స్థలం కేటాయిస్తున్నారు. వర్సిటీ విద్యార్థులను సైతం ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు, ఆచార్యులు తమ ఆలోచనలతో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ దశల్లో వడపోత చేసి ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేస్తారు. ఏటా రెండు లేదా మూడు సార్లు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. తొలి విడతలో ఇప్పటికే 20 దరఖాస్తులు స్వీకరించి ముగ్గుర్ని ఎంపిక చేశారు.

అంతా ఉచితంగానే..

ఎంపికైనవారు తమ ఆలోచనను అంకుర సంస్థ దశకు తీసుకెళ్లేలా సహకారం అందిస్తారు. ముందుగా ప్రీ ఇంక్యుబేషన్‌ స్థలం కేటాయిస్తారు. అక్కడ తమ ఆలోచనలు ఆచరణలోకి తీసుకువచ్చి ప్రోటోటైప్‌లు సిద్ధం చేసే వీలుంటుంది. రసాయనాలు, ఆధునిక పరికరాలను ఆరునెలలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అవసరమైన మెంటారింగ్‌ లభిస్తుంది. అనంతరం ప్రీ ఇంక్యుబేషన్‌ పూర్తి చేసుకుని ఆలోచన విజయవంతమైతే నిధులు కేటాయించి అంకుర సంస్థ ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్నారు.


4-6 నెలల్లో అంకురానికి పునాది: ఎ.వెంకట పార్థసారథి, పూర్వ విద్యార్థి

ప్రీ ఇంక్యుబేషన్‌ పొందేందుకు నా ఆలోచన ఎంపికైంది. 2006-08 మధ్య హెచ్‌సీయూలో ఎమ్మెస్సీ చదివాను. సీసీఎంబీలో పీహెచ్‌డీ తరువాత విదేశాల్లో పోస్ట్‌డాక్‌ చేసి వచ్చాను. ప్రస్తుతం నా ఆలోచనతో హెచ్‌సీయూ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నాలుగు నుంచి ఆరు నెలల్లో అంకుర సంస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తా.


విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం: రాజగోపాల్‌, అస్పైర్‌ బయోనెస్ట్‌ సంచాలకుడు
నిధులు, స్థలం, పరికరాల లభ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆలోచనలను అణచివేసుకుంటారు. అలాంటి విద్యార్థులు, ఆచార్యులకు ఉపయుక్తంగా ఉండేలా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని విధాలుగా మద్దతివ్వాలని నిర్ణయించాం. అప్పుడే వారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుంటుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts