Housing board land: హౌసింగ్‌ బోర్డు భూముల వేలం

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న హౌసింగ్‌ బోర్డు భూములను వేలం వేసేందుకు కసరత్తు మొదలైంది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములపై అధికారులు దృష్టి పెట్టారు. డిమాండ్‌ బాగా ఉన్నవి, విలువైన భూములను గుర్తించారు.

Updated : 10 Aug 2022 04:39 IST

 రూ. 600-700 కోట్ల ఆదాయం లక్ష్యం

అనుమతి కోసం సీఎంకు త్వరలో ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న హౌసింగ్‌ బోర్డు భూములను వేలం వేసేందుకు కసరత్తు మొదలైంది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములపై అధికారులు దృష్టి పెట్టారు. డిమాండ్‌ బాగా ఉన్నవి, విలువైన భూములను గుర్తించారు. వీటిని విక్రయించి నిధులు సమీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలో ఈ ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం ఆమోదం తర్వాత భూముల వేలం ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు.  రూ. 600-700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

వివాదాలు లేనివి రెండో విడతలో

ఉమ్మడి రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల కోసం గృహ నిర్మాణ శాఖ అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్‌ గృహాలు నిర్మించి విక్రయించింది. వీటి కోసం రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. అయితే కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇంకొన్ని చోట్ల కొనుగోలుదారుల నుంచి అనుకున్న డిమాండ్‌ లేని కారణంగా ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఇళ్లు కట్టిన చోట కూడా పూర్తిస్థాయి నిర్మాణాలు జరగలేదు. దీంతో అక్కడ, ఇక్కడ ఖాళీ భూములు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, కైత్లాపూర్‌ గచ్చిబౌలి, చింతల్‌, పోచారం సహా పలు చోట్ల భూములు ఉన్నాయి. ఇందులో న్యాయపరమైన చిక్కులు లేనివాటిని గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే వేలం ద్వారా భూములను విక్రయించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఇప్పటికే ఒక దఫా హౌసింగ్‌ బోర్డు భూములను విక్రయించింది. భూముల అమ్మకం ద్వారా మొత్తం రూ.2,379.48 కోట్ల ఆదాయం రాబట్టాలన్నది హౌసింగ్‌బోర్డు లక్ష్యం. తొలి విడత వేలంలో దాదాపు రూ.470 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. వివాదాలు లేనివి రెండో విడతలో విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని