Updated : 10 Aug 2022 05:07 IST

KCR: రేపు మంత్రిమండలి సమావేశం

ధాన్యం.. మునుగోడుపై చర్చ

కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులపై నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి రుణపరిమితిలో కేంద్రం కోత, బాండ్ల విక్రయంపై ఆంక్షలు తదితర అంశాలతో పాటు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై కేంద్రం కొర్రీల నేపథ్యంలో ఇటీవల సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌, సునీల్‌శర్మలతో కలిసి దిల్లీ వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులను కలిసి రుణ ఆంక్షలపై అభ్యంతరాలు తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ రుణ ఆంక్షలను సడలించి మరో రూ.10 వేల కోట్ల రుణానికి అనుమతించింది. మరో రూ.15 వేల కోట్ల రుణంపై కేంద్ర మంత్రిత్వ శాఖలను ఉన్నతాధికారులు కోరినా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరులపై కేసీఆర్‌ దృష్టి సారించారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్‌ను ఎఫ్‌సీఐ నిలిపివేయడంతో ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయి. వర్షాలకు తడుస్తూ మట్టిపాలవుతున్నాయి. ఈ క్రమంలో ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించేందుకు మంత్రిమండలి అనుమతించనుంది.
రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

అనాథపిల్లల సంక్షేమానికి మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల పలు సిఫార్సులు చేసింది. వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, అనాథాశ్రమాల నిర్వహణతో పాటు వారి కోసం పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. వీటన్నింటికీ మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశం, 75 మంది ఖైదీల విడుదల, ఇతర నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానానికి ఉపఎన్నికపై  రాజకీయపరమైన అంశాల కింద మంత్రిమండలిలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పాలనపరమైన అంశాలపైనా చర్చ జరగనుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని