వర్షాలు, వరదల్లో.. అక్రమాల పరవళ్లు

వానలు, వరదల్లోనూ ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాగులు, ఉపనదుల్లో నీళ్లు ప్రవహిస్తున్నా వదిలిపెట్టట్లేదు. నీటి ప్రవాహంలోనూ ఇసుకను అడ్డంగా తోడేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, మూసీ, మంజీర, దుందుబి నదులు

Updated : 11 Aug 2022 06:04 IST

 వాగుల్లో  యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలు

తెల్లవారుజామున, రాత్రి వేళల్లో నిరాటంకంగా దందా

వానలు, వరదల్లోనూ ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాగులు, ఉపనదుల్లో నీళ్లు ప్రవహిస్తున్నా వదిలిపెట్టట్లేదు. నీటి ప్రవాహంలోనూ ఇసుకను అడ్డంగా తోడేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, మూసీ, మంజీర, దుందుబి నదులు, ఆకేరు వంటి వాగుల్లో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నదుల్లోకి నీళ్లు రావడం, రోడ్లు దెబ్బతినడంతో అధికారిక ఇసుక అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇసుక కావల్సినవాళ్లు ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం రోజులు, వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అక్రమార్కులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు చోట్ల  ఇసుక అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. వాగుల్లో, వాటి సమీప భూముల్లో అక్రమార్కులు ఇసుకను తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. పగటి సమయంలో నిఘా ఉంటుందన్న కారణంతో చాలాచోట్ల రాత్రివేళ, కొన్ని చోట్ల తెల్లవారుజామున 3 నుంచి ఉదయం ఆరేడు గంటల వరకు తరలించేస్తున్నారు. నల్గొండ జిల్లా వంగమర్తిలో మూసీ నుంచి భారీగా ఇసుకను అక్రమంగా తీసుకెళుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓ పోలీసు పహారా కాస్తున్న నేపథ్యంలో ఆరేడు గంటల నుంచి రాత్రి 10 వరకు, ఉదయం ఐదారు నుంచి 9 గంటల వరకు ఇసుకను ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు.

* కాళేశ్వరం నుంచి వెళ్లే ఇసుక లారీల్లో బుకింగ్‌ కంటే అధికంగా ఇసుక నింపుతున్నారు.

* జూన్‌, జులై నెలల్లో ఓవర్‌లోడ్‌కు సంబంధించి ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో  108 కేసులు నమోదయ్యాయి.

* కామారెడ్డి జిల్లా మద్నూరు, బిచ్కుంద మండలాల పరిధిలో మంజీర నదికి వర్షకాలంలో వచ్చే వరదలను ముందుచూపుతో గుర్తించి వేసవిలోనే ఇసుకను నది నుంచి తోడి డంప్‌ చేశారు. ఇప్పుడు లారీల్లో నింపి ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

* ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని తమ్మిలేరు వాగుకు వరద రావడంతో వాగులో ఇసుకమేటలు వేశాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇష్టానుసారంగా ఆ ఇసుకను కొల్లగొడుతున్నారు. వాగులో నుంచి రోడ్డుపైకి రావడానికి ప్రత్యేక మార్గం వేసుకున్నారు.

రూ.10 కోట్ల జరిమానాకు నోటీసులు

వర్ధన్న పేట మండలంలోని రెండు గ్రామాల్లో ఇసుకను అక్రమంగా విక్రయించడంపై మైనింగ్‌ శాఖ కొంతకాలం క్రితం స్పందించింది. 36 మందికి నోటీసులు జారీ చేసి రూ.10 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

* ఆసిఫాబాద్‌ జిల్లాలో రాస్‌పల్లి, గంగాపూర్‌ వాగుల్లో ఎర్ర ఇసుక నాణ్యమైంది కావడంతో డిమాండ్‌ బాగా ఉంది. రోజూ 20కి పైగా లారీల ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఆసిఫాబాద్‌ పెదవాగు నుంచి నిత్యం 40-50 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది.

* తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) రోజుకు 70-80వేల టన్నుల ఇసుకను విక్రయిస్తుంది. అయినా ఇళ్లు, ఇతర నిర్మాణాలకు అవసరమైన ఇసుక డిమాండ్‌కు ఈ సరఫరా సరిపోదు. జూన్‌ 10న 78,203.98 టన్నుల ఇసుకను విక్రయిస్తే- అదే ఆగస్టు 10న వానల నేపథ్యంలో అమ్మకాలు అతికష్టమ్మీద 1,411.60 టన్నులకు పరిమితం అయ్యాయి.


ఆకేరు వాగు ఖాళీ..

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఆకేరు వాగు నుంచి నిత్యం వేల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా వరంగల్‌కు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. తెల్లవారుజాము 3-6 గంటల మధ్య ఈ దందా పూర్తవుతోంది. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు విక్రయిస్తున్నారు. అక్రమార్కుల ధాటికి వాగులో ఇసుకంతా ఖాళీ అయ్యింది. దీంతో వాగుకు అనుకుని ఉన్న నద్ది భూములను రైతుల నుంచి ఇసుక వ్యాపారులు కొనుగోలు చేసి యంత్రాల సహాయంతో ఇసుకను తోడేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని నందనం, రాంనగర్‌, కక్కిరాలపల్లి, ఇల్లంద, గర్మిల్లపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు తగ్గి ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని